Income Tax Notice: పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ, తననెవరూ గమనించడం లేదని అనుకుంటుందట. అలాగే, ఏ వ్యక్తి అయినా క్యాష్‌లో డీలింగ్స్‌ చేసి, ఆదాయ పన్ను విభాగానికి అది తెలీదు అనుకుంటే, పప్పులో కాలేసినట్లే. ఒకవేళ మీరు నగదు రూపంలో భారీ కార్యకలాపాలు చేసి ఉంటే, అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. మీ మీద ఆదాయపు పన్ను శాఖ దృష్టి పడి ఉండవచ్చు. పెద్ద విలువతో నగదు లావాదేవీలు జరిపే వారికి ఆదాయ పన్ను విభాగం ప్రత్యేక నోటీసులు ఇస్తోంది. పెద్ద మొత్తంలో జరిగే ప్రతి డీల్‌ మీద అధికారులు నిఘా పెడుతున్నారు. మీరు ఏ రూపంలోనైనా పెద్ద విలువతో క్యాష్‌ డీల్‌ చేసి ఉన్నా, చేయాలని అనుకుంటున్నా.. దానికి సంబంధించి ఆదాయ పన్ను చట్టం నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.


బ్యాంక్, మ్యూచువల్ ఫండ్ హౌస్, బ్రోకర్ ప్లాట్‌ఫాం, ప్రాపర్టీ మొదలైన వాటిలో నగదు పెట్టుబడి విషయంలో ఆదాయపు పన్ను శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. మీరు పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేస్తే, దాని గురించి ఆదాయపు పన్ను విభాగానికి తప్పకుండా తెలియజేయాలి. అలాంటి కొన్ని లావాదేవీల గురించి మేం మీకు చెబుతాం. ఈ విషయాలను మీరు దాచాలని ప్రయత్నిస్తే, అది మీకు పెద్ద సమస్యను సృష్టించవచ్చు.


10 లక్షల నగదు లావాదేవీ
మీరు... షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌, డిబెంచర్లు, బాండ్లలో నగదు లావాదేవీలు చేయాలని భావిస్తే, ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల రూపాయల వరకు నగదు లావాదేవీలు చేయవచ్చు. మీరు ఇందులో డబ్బును పెట్టుబడి పెడుతుంటే, పెద్ద మొత్తంలో నగదును ఉపయోగించవద్దు. మీరు ఇప్పటికే ఇలా చేసి ఉంటే ఇన్‌కం టాక్స్‌ డిపార్ట్‌మెంట్ మీకు నోటీసు పంపవచ్చు.


ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో 10 లక్షల రూపాయల పెట్టుబడి
మీరు సంవత్సరానికి ఒకసారి లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో డిపాజిట్ చేస్తుంటే, ఆ డబ్బును మీరు ఎలా సంపాదించారో చెప్పమంటూ ఆదాయపు పన్ను విభాగం మిమ్మల్ని కోరవచ్చు. ఈ బాధ నుంచి తప్పించుకోవాలంటే, ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా లేదా చెక్ రూపంలో ఎక్కువ డబ్బును FDలో డిపాజిట్ చేయండి.


రూ. 10 లక్షలకు మించి ఖాతాలో జమ చేశారా?
ఒక వ్యక్తి, తనకు ఉన్న బ్యాంక్‌ ఖాతాలో లేదా ఒకటి కంటే ఎక్కువ ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో డిపాజిట్ చేస్తే, ఆదాయపు పన్ను విభాగం ఆ డబ్బు గురించిన సమాచారాన్ని అడగవచ్చు. కరెంట్ ఖాతాల్లో గరిష్ట పరిమితి రూ. 50 లక్షలు.


క్రెడిట్ కార్డ్ బిల్లును నగదు రూపంలో చెల్లిస్తే?
మీరు ఒకేసారి ఒక లక్ష రూపాయల కంటే ఎక్కువ నగదును క్రెడిట్ కార్డ్ బిల్లుగా నగదు రూపంలో చెల్లిస్తే ఆదాయపు పన్ను శాఖ నుంచి మీకు నోటీసు వచ్చే అవకాశం ఉంది. ఆ డబ్బు మూలానికి సంబంధించిన సమాచారం చెప్పాలంటూ ఐటీ విభాగం మిమ్మల్ని కోరవచ్చు. మరోవైపు, మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్లును నగదు రూపంలో చెల్లించినప్పటికీ, ఆ డబ్బు మూలం గురించి మిమ్మల్ని అడగవచ్చు.


ఆస్తిని నగదు రూపంలో కొనడం లేదా అమ్మడం
మీరు ఒక ఆస్తికి సంబంధించి నగదు రూపంలో పెద్ద లావాదేవీ చేస్తే, దాని నివేదిక ఆదాయపు పన్ను శాఖకు వెళుతుంది. మీరు రూ. 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని నగదు రూపంలో కొనుగోలు చేయడం లేదా అమ్మడం చేస్తే, ఆ ఆస్తి వివరాలు రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఆదాయపు పన్ను విభాగానికి వెళ్తాయి.