Delhi News :      ఢిల్లీ ఎమ్మెల్యేలకు సీఎం కేజ్రీవాల్ గుడ్ న్యూస్ చెప్పారు. ఎమ్మెల్యేల జీతాలు, అలవెన్సులు 66 శాతానికి  పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి భారత రాష్ట్రపతి ఆమోదం లభించింది. 12 ఏళ్ల తర్వాత ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు పెరిగాయి. ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న మొత్తం 70 మంది జీతాలు ఫిబ్రవరి 14 నుంచి అమలులోకి రానున్నాయి. పైగా పెరిగాయి.  గత ఏడాది జూలై 4వ తేదీన ఎమ్మెల్యేల జీతాలు పెంచుతూ ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇప్పటికి రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. 


ఇక  నుంచి ఢిల్లీలో ఎమ్మెల్యేలకు నెల జీతం రూ. 90 వేలు                    


 ఢిల్లీలో ఎమ్మెల్యేలకు ఇక నుంచి జీతం  నెలకు రూ. 90 వేలు లభించనుంది. గతంలో రూ.54,000 మాత్రమే ఉండేది.  ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌, చీఫ్‌ విప్‌, ప్రతిపక్షనేతలకు కూడా జీతం, అలవెన్సులు నెలకు రూ.72 వేల నుంచి రూ.1 లక్షా 70 వేలకు పెంచారు.  ఎమ్మెల్యేల మూల వేతనాన్ని నెలకు రూ.12 వేల నుంచి రూ.30 వేలకు, మంత్రులకు నెలకు రూ.20 వేల నుంచి రూ.60 వేలకు పెంచారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 


రోజూ వారీ డీఏ కూడా  రూ. ఐదు వందలు పెంపు -  అసెంబ్లీ ఆమోదించిన ఏడాది తర్వాత ఆమోదం                                               


రోజువారీ భత్యం కూడా రూ.1000 నుంచి రూ.1500కి పెంచారు. జులై 2022లో ఢిల్లీ అసెంబ్లీ ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాలను పెంచుతూ ఢిల్లీ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో.. లా డిపార్ట్‌మెంట్ జీతాల పెంపునకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇక పెంచిన ఎమ్మెల్యే వేతనాలు ఫిబ్రవరి 14 నుంచి అమల్లోకి రానుంది.మాజీ శాసన సభ్యుల పెన్షన్లు కూడా పెరిగాయి. ఇంతకు ముందు కేవలం నెలకు రూ.7,500 అందుకునే వారంతా ఇక నుంచి నెలకు 15,000 రూపాయలు అందుకోనున్నారు. 


ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యే్లతో పోలిస్తే తక్కువేనంటున్న ఆప్                                                       


 ప్రస్తుతం ఎమ్మెల్యేల జీతాలు పెరిగినప్పటికీ..ఈ జీతాలు ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల జీతాలతో పోల్చితే తక్కువేనని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  2015లో ఓ సారి ఢిల్లీ ప్రభుత్వం ఎమ్మెల్యేల జీతాలు పెంచడానికి ప్రయత్నించింది. 2.10 లక్షల నెల జీతం ఇవ్వాలని ప్రతిపాదించింది. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో  అధికారాలు పరిమితంగా ఉంటాయి.ఇప్పుడు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో జీతాలు పెరిగాయి.