Rains in Delhi: మొన్నటి వరకూ ఎండ వేడితో ఉక్కిరిబిక్కిరి అయిన ఢిల్లీ ప్రజలు ఇప్పుడు వరదలతో నానా పాట్లు పడుతున్నారు. భారీ వర్షాలతో దేశ రాజధాని తడిసి ముద్దైపోయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్లన్నీ నీట మునిగాయి. 88 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. వర్షాకాలం మొదట్లోనే ఇలా ఉంటే రానురాను మరింత భారీ వర్షాలు కురుస్తాయేమోనన్న ఆందోళన పెరుగుతోంది. వచ్చే ఐదు రోజుల పాటు ఢిల్లీలో ఇదే పరిస్థితి ఉంటుందని IMD స్పష్టం చేసింది. జులై 1వ తేదీ వరకూ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కేవలం 24 గంటల్లోనే 228.1 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఫలితంగా అన్ని ప్రాంతాలూ నీట మునిగాయి. ఇప్పటి వరకూ ఈ వరదల కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు చిన్నారులు కాలువలో పడి కొట్టుకుపోయారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఇప్పటికే IMD వెల్లడించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఢిల్లీ NCR, ద్వారకా, పాలం, వసంత్ విహార్, వసంత్ కుంజ్, గుడ్‌గావ్, మనేసర్, ఫరిదాబాద్‌లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. 


ఉస్మాన్‌పూర్‌లో ఇంటి ముందు ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఓ గుంటలో పడి మునిగి ప్రాణాలు కోల్పోయారు. వసంత్ విహార్‌లో భారీ వర్షాలకు ఓ భవనం కూలిపోయింది. ఆ శిథిలాల కింద ముగ్గురు కార్మికులు చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది వచ్చి వాళ్లను సురక్షితంగా బయటకు తీశారు. వరదలకు తోడు విద్యుత్ కోతలూ ఇబ్బంది పెడుతున్నాయి. నీటి సరఫరా కూడా ఆగిపోయింది. ఇటు కరెంట్ లేక అటు తాగడానికి నీళ్లూ లేక ఢిల్లీ వాసులు అల్లాడిపోతున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో టర్మినల్ 1 కుప్ప కూలిన ఘటనతో అంతా ఉలిక్కి పడ్డారు. ప్రస్తుతానికి ఆ టర్మినల్‌ని మూసివేశారు.