దేశంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడుతున్నట్లు వస్తోన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. విద్యుత్ సంక్షోభంపై భయాందోళనలు అవసరం లేదని కొట్టిపారేసింది. కేవలం గెయిల్, డిస్కం సంస్థల మధ్య సమాచార లోపం వల్లే ఇలాంటి వార్తలు వస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం వెల్లడించారు.
దేశంలో విద్యుత్ సంక్షోభానికి కారణమయ్యే సరఫరా, వినియోగం మధ్య ఎలాంటి అగాధం లేదని ఆయన తెలిపారు. విద్యుత్ కేంద్రాలకు అవసరమైన గ్యాస్ అందించాలని ఇప్పటికే గెయిల్ సీఎండీకి ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఎన్‌టీపీపీ, బీఎస్‌ఈఎస్‌లతో పాటు విద్యుత్ మంత్రిత్వశాఖ అధికారులతో ఆయన నివాసంలో సమావేశమైన అనంతరం ఆర్‌కే సింగ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందంటూ వినియోగదారులకు సమాచారాన్ని పంపడం పట్ల కొన్ని సంస్థలను హెచ్చరించామన్నారు.
ప్రభుత్వ లెక్కలు ఇలా..
కేంద్ర విద్యుత్ శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం దేశంలో ఉన్న 135 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 108 చోట్ల బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. వాటిలో 28 చోట్ల ఒక్క రోజుకు సరిపడా బొగ్గు మాత్రమే ఉంది, వెంటనే బొగ్గు సప్లై చేయలేకపోతే కరెంట్ ఉత్పత్తి నిలిచిపోతుంది. గత వారం చివరి నుంచి అనేక చోట్ల ఇటువంటి గడ్డు పరిస్థితుల్లోనే పవర్ ప్లాంట్లు నడుపుకొస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పవర్ క్రైసిస్‌పై ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశారు.
దిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా బొగ్గు కొరత గురించి పూర్తి వివరాలతో ప్రధానికి లేఖ రాశారు. దిల్లీ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని, దీనిపై తాను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరిపడా బొగ్గు నిల్వలు, గ్యాస్ సరఫరా అందిచాలని ప్రధాని మోదీని కోరారు.
Chocolates in AC Coaches: తొలిసారి ఏసీ కోచ్‌లలో చాక్లెట్లు తరలింపు.. ఎన్ని టన్నులో తెలుసా?