దసరా ముందు ఆదివారం కావడంతో బిగ్ బాస్ హౌస్ పండుగ ఎపిసోడ్ కోసం ముస్తాబైపోయింది. గొడవలు, పంచాయతీలు, తీర్పులు, తిట్టుకోవడాలు అన్నీ పక్కన పెట్టి... ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ వాతావరణమే కనిపించింది ఇంట్లో. తాజా ప్రోమోను చూస్తుంటే ఆదివారం ఎపిసోడ్ ప్రేక్షకులకు నచ్చేలా కనిపిస్తోంది. నాగార్జున పంచెకట్టుతో బంగార్రాజులా ముస్తాబై వచ్చారు వేదిక మీదకి. కొంత మంది తారలను కూడా తీసుకొచ్చి డ్యాన్సులతో అదరగొట్టించారు. నేటి ప్రోమోలో ఏముందో ఓసారి చూస్తే...
మంగ్లీ మంచి పాటతో వేదికను ఒక ఊపు ఊపేసింది. ఆ పాటకు చిందేయ్యాలనిపిస్తుంది ఎవరికైనా. జబర్దస్ట్ ఆది ఈసారి పోలీస్ గెటప్ లో వచ్చాడు. షన్ను, సిరి, జెస్సీ గ్రూపుపై పంచ్ లేశాడు. వారిని త్రిమూర్తులుగా పిలిచాడు. ఇక హమీద-శ్రీరామ్ లకు గట్టి పంచే పడింది. ‘మీ ఇద్దరి మీద బయట ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు... హమీద వాకిట్లో శ్రీరామ్ చెట్టు’ అనగానే హౌస్ అంతా నవ్వులే నవ్వులు. హమీద, శ్రీరామ్ మాత్రం కాస్త సిగ్గుపడ్డారు. కుమారి 21ఎఫ్ హెబ్బా పటేల్ చాలా రోజుల తరువాత మళ్లీ బుల్లి తెరపై కనిపించింది. డిచిక డిచిక డింక పాటకు చిందులేసింది. ఆమె డ్యాన్సును ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేలా ఉంది.
ఇక మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హీరోహీరోయిన్లు పూజా, అఖిల్ ప్రత్యేక అతిధులుగా వచ్చారు. ప్రోమోలో అఖిల్ ఎక్కడా మాట్లాడినట్టు కనిపించలేదు. పూజా మాత్రం ఫుల్ జోష్ మీద కనిపించింది. మొత్తమ్మీద ఆదివారం ఎపిసోడ్ అదిరిపోయేలా ఉంది.