Water Crisis in Delhi: ఢిల్లీలో నీటి సంక్షోభం రోజురోజుకీ (Delhi Water Crisis) ముదురుతోంది. హరియాణా నుంచి రావాల్సిన నీటి వాటా రావడం లేదని ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. విచారణ చేపట్టిన కోర్టు ఆప్‌ని మందలించింది. వాటర్ ట్యాంకర్ మాఫియా కొనసాగుతుంటే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. పోలీసులను రంగంలోకి దింపి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. రాజకీయంగానూ ఈ అంశం వేడి పుట్టించింది. ఇది పూర్తిగా ఆప్ వైఫల్యమే అని బీజేపీ స్పష్టం చేస్తోంది. నీళ్లను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ జల్‌ బోర్డ్‌ కార్యాలయంపై బీజేపీ నేతలు దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేశారు. దీనిపై ఆప్ తీవ్రంగా మండి పడుతోంది. ఇదంతా ఎవరి కుట్రో అర్థమవుతోందా అని ఢిల్లీ ఆరోగ్యమంత్రి సౌరభ్ భరద్వాజ్ ఓ పోస్ట్ పెట్టారు. బీజేపీ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా విమర్శించారు. 






బీజేపీయే కుట్ర చేసి మరీ ఢిల్లీలో నీటి సరఫరా కాకుండా అడ్డుకుంటోందని ఆరోపిస్తోంది ఆప్. పైప్‌లైన్‌లనూ పగలగొట్టే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. అంతే కాదు. పైప్‌లైన్స్‌కి పోలీసులతో భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తోంది. ఢిల్లీ మంత్రి అతిషి ఈ మేరకు ఢిల్లీ కమిషనర్‌కి లేఖ రాశారు. పైప్‌లైన్స్ వద్ద భద్రత ఏర్పాటు చేసేలా చొరవ చూపించాలని కోరారు. అంతకు ముందు మంత్రి అతిషి ట్విటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ఓ పైప్‌లైన్‌పై నట్స్‌, బోల్ట్స్‌ తొలగించారని, ఇది ఎవరి పని అని ప్రశ్నించారు. వచ్చే 15 రోజుల పాటు పైప్‌లైన్స్‌కి రక్షణ కల్పించాలని ఆప్ కోరుతోంది. యమునా నదిలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల ఈ స్థాయిలో సమస్య తలెత్తింది. ఇప్పటికే ఢిల్లీ జల్‌ బోర్డ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ వద్ద ప్యాట్రోలింగ్ చేస్తోంది. 


 






Also Read: NCERT Books Revised: NCERT బుక్స్‌లో బాబ్రీ మసీదు పాఠం తొలగింపు, వివాదాల జోలికి పోకుండా సిలబస్‌లో మార్పులు