దిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తనను మోసం చేసి వివాహం చేశారని ఓ భర్త వేసిన పిటిషన్‌ను విచారించిన అనంతరం ఆ పెళ్లిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెళ్లి చేసేముందు అన్ని విషయాలు ఇరు వర్గాలు బహిర్గతం చేయాలని జబ్బులు, రోగాలను రహస్యంగా ఉంచరాదని ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
ఓ వ్యక్తి ఆరోగ్యం క్షీణించడం తన తప్పు కాదని.. అయితే అది పెళ్లి కోసం దాయడం కచ్చితంగా మోసమేనని జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ జస్మిత్ సింగ్ ధర్మాసనం పేర్కొంది.
పెళ్లికి ముందే..
తన భార్యకు పెళ్లికి ముందే తీవ్రమైన తలనొప్పి ఉండేదని.. దీని వల్ల చదువు కూడా మానేసిందని భర్త ఆరోపించినట్లు కోర్టు పేర్కొంది. అయితే సాధారణమైన తలనొప్పికి చదువు మానేయాల్సిన అవసరం ఏముందని కోర్టు ప్రశ్నించింది. మానసిక రోగంతో బాధపడేవారికి కూడా తలనొప్పి ఓ లక్షణమేనని కోర్టు అభిప్రాయపడింది. ఈ విషయాన్ని పెళ్లి చేసుకునే అబ్బాయికి ముందే చెప్పి ఉండాల్సిందని కోర్టు పేర్కొంది. ఇలా చెప్పకపోవడం ముమ్మాటికి మోసమేనని.. కనుక ఈ వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.
ఇదే కేసు..
2005 డిసెంబర్ 10న తనకు వివాహం జరిగిందని పిటిషన్‌లో బాధిత భర్త పేర్కొన్నాడు. తన భార్య మనోరోగంతో బాధపడుతుందనే విషయాన్ని ఆమె తల్లిదండ్రులు దాచి వివాహం చేశారని ఆరోపించాడు. తన భార్య ఎక్యూట్ స్కిజోఫ్రెనియాతో పెళ్లికి ముందు నుంచే బాధపడుతుందని పేర్కొన్నాడు. పెళ్లి జరిగిన నాటి నుంచి హనీమూన్ సమయంలోనూ అసాధారణంగా ప్రవర్తించిందని తెలిపాడు.
దీంతో 2006లో జీబీ పంత్ ఆసుపత్రి, ఎయిమ్స్, హిందూ రావ్ ఆసుపత్రిలో తన భార్యను చూపించినట్లు చెప్పాడు. అయితే ఆ వైద్యుల వద్ద తాను అంతుకుముందే చికిత్స తీసుకున్నట్లు తన భార్య ఒప్పుకున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నాడు. సదరు వైద్యులు ఆమె ఎక్యూట్ స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నట్లు చెప్పారన్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి