Manish Sisodia:


హాజరు కాలేను: సిసోడియా 


ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాకు లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు మరోసారి CBI నుంచి పిలుపు వచ్చింది. ఈ విషయాన్ని వెల్లడించిన సిసోడియా...విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు. అయితే...ఇంతలోనే విచారణకు హాజరు కాలేనని CBIకి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. పోస్ట్‌పోన్ చేయాలని కోరారు. నిజానికి ఇవాళే సిసోడియా విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే...ఉన్నట్టుండి ఆయన ఈ తేదీని మార్చాలని అడిగారు. సీబీఐ తనను అరెస్ట్ చేసే అవకాశముందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను తయారు చేసే పని తుది దశకు చేరుకుందని..ఇది పూర్తయ్యాక విచారణకు హాజరవుతానని చెప్పారు. ఆర్థిక శాఖ కూడా తన పరిధిలోనే ఉందని, బడ్జెట్ తయారు చేసే పనిలో ఉన్నానని తెలిపారు. 


"నేను ప్రతిసారీ సీబీఐ అధికారులకు సహకరించాను. కానీ ఢిల్లీ ప్రజలకు ఇదెంతో కీలక సమయం. బడ్జెట్‌ను ప్రిపేర్ చేస్తున్నాం. ఫిబ్రవరి నెలాఖరులోగా ఆ ప్రతులను కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. నన్ను అరెస్ట్ చేసే అవకాశముంది. అందుకే బడ్జెట్‌ను ఫైనలైజ్ చేసే వరకూ ఆగాలని సీబీఐని కోరాను. ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం నా బాధ్యత. 24 గంటలు అదే పనిలో ఉన్నాను. అందుకే ఫిబ్రవరి చివరి వారం వరకూ సమయం ఇవ్వాలని కోరాను" 


- మనీశ్ సిసోడియా, ఢిల్లీ డిప్యుటీ సీఎం











అయితే..CBI తదుపరి విచారణ తేదీని ఇంకా ఖరారు చేయలేదు. అటు బీజేపీ మాత్రం సిసోడియాపై మండి పడుతోంది. విచారణ నుంచి తప్పించుకోడానికి ఇదో సాకు అని విమర్శిస్తోంది. ఇలా ఎన్ని రోజులు తప్పించుకుని తిరుగుతారో చూస్తామని సెటైర్లు వేసింది. 


సహకరిస్తా: సిసోడియా 


ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా మరోసారి హాజరు కావాలని వెల్లడించింది. ఇదే విషయాన్ని సిసోడియా ధ్రువీకరించారు. ట్విటర్ ద్వారా వివరాలు వెల్లడించారు. 


"సీబీఐ నుంచి నాకు మరోసారి పిలుపు వచ్చింది. సీబీఐతో ఈడీలకు పూర్తి అధికారాలు ఇచ్చి నాపైకి వదులుతున్నారు. నా ఇంటిని సోదా చేశారు. బ్యాంక్ లాకర్‌నూ సెర్చ్ చేశారు. కానీ వాళ్లకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఢిల్లీలోని విద్యార్థులకు మంచి చదువు అందాలని ఎన్నో చర్యలు తీసుకున్నాను. అందుకే వాళ్లు నన్ను నియంత్రించాలని చూస్తున్నారు. నేను ఇప్పటి వరకూ విచారణకు సహకరించాను. ఇకపైన కూడా ఇదే విధంగా సహకరిస్తాను"
-మనీశ్ సిసోడియా, ఢిల్లీ డిప్యుటీ సీఎం


Also Read: Shiv Sena Symbol: పార్టీ పేరు గుర్తు కోసం కోట్లు ఖర్చు చేశారు , త్వరలోనే ఈ డీల్‌ వివరాలు బయటకొస్తాయ్ - సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు