Delhi CM Arvind Kejriwal: ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనడానికి ప్రయత్నిస్తోందని ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈ ఆరోపణలపై నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ టీమ్‌ ఆయన ఇంటికి చేరుకుంది. కేజ్రీవాల్‌తో పాటు మంత్రి అతిషి ఇంటికి కూడా వెళ్లింది. అయితే...కేజ్రీవాల్‌ ఆ నోటీసులను తిరస్కరించారు. క్రైమ్ బ్రాంచ్ టీమ్ వెళ్లిన సమయానికి మంత్రి అతిషి ఇంట్లో లేరని, ఆమెకి కూడా నోటీసులు అందలేదని తెలిసింది. కేజ్రీవాల్‌ని వ్యక్తిగతంగా కలిసి ఈ నోటీసులు ఇవ్వాలని అధికారులు భావించారు. అంతకు ముందు ఢిల్లీ బీజేపీ కేజ్రీవాల్ ఆరోపణలపై సీరియస్ అయింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకి ఫిర్యాదు చేసింది. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కొద్ది రోజులుగా బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌కి 5 సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ...కేజ్రీవాల్ 5 సార్లు విచారణకు హాజరు కాలేదు. కేవలం తమపై కుట్ర చేసి ఈ స్కామ్‌లో ఇరికిస్తున్నారంటూ కేజ్రీవాల్ మండి పడుతున్నారు. 


"అరవింద్ కేజ్రీవాల్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదు చేశాం. ఆయన అబద్ధాల వెనకున్న అసలు నిజాలన్నీ కచ్చితంగా బయటకు రావాలి. నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడి ఆ తరవాత విచారణ నుంచి తప్పించుకుంటానంటే కుదరదు"


- వీరేంద్ర సచ్‌దేవ, ఢిల్లీ బీజేపీ చీఫ్ 


ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే ఆరోపించారు. తమ పార్టీకి చెందిన 7గురు ఎమ్మెల్యేలతో ఆ పార్టీ సంప్రదింపులు జరిపిందని తేల్చి చెప్పారు. తనను అరెస్ట్ చేసి మెల్లగా ఎమ్మెల్యేలందరినీ లాక్కుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తోందంటూ మండి పడ్డారు. ఈ విషయం కొందరు బీజేపీ నేతలే తనకు స్వయంగా చెప్పారంటూ బాంబు పేల్చారు. X వేదికగా పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం సంచలనమైంది. 21 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టు బీజేపీ చెబుతున్నా...తమకున్న సమాచారం ప్రకారం ఏడుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు చూస్తోందంటూ కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేశారు. కానీ వాళ్లంతా అందుకు అంగీకరించలేదని స్పష్టం చేశారు. కేవలం తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మాత్రమే తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని,అందుకోసం లిక్కర్ స్కామ్‌ని సాకుగా చూపిస్తున్నారని మండి పడ్డారు.


"మరి కొద్ది రోజుల్లో మేం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తామని బీజేపీ చెబుతోంది. అంతే కాదు. మా పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు కుట్ర చేస్తోంది. రూ.25 కోట్లు ఇచ్చి వాళ్లను లాక్కోవాలని చూస్తోంది. ఆ తరవాత మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్లాన్ చేస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకి రూ.25 కోట్లు ఇవ్వడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో వాళ్లందరికీ బీజేపీ తరపున పోటీ చేసేందుకు కూడా ఆ పార్టీ ఆశ చూపుతోంది"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి


Also Read: LK Advani: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి భారతరత్న, ప్రధాని మోదీ కీలక ప్రకటన