AP Elections 2024: ఏపీ(Andhrapradesh)లో మరో రెండు మాసాల్లోనే ఎన్నికలు(Elections) జరగనున్నాయి. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు ఎన్నికలు కూడా ఒకే సారి జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని రెండు ప్రధాన పక్షాలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టా త్మకంగా తీసుకున్నాయి. గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే.. ఇప్పుడు ఎక్కువగా తెచ్చుకుని `వైనాట్ 175` నినాదాన్ని నిలబెట్టుకునేందుకు అధికార పార్టీ వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తమ నాలుగున్నరేళ్ల సంక్షేమాన్ని, పథకాలను కూడా ప్రజలకు చేరువ చేస్తోంది. ఎక్కడ సభ పెట్టినా తమ పాలనలో జరిగిన మేళ్లను వివరిస్తోంది.
చంద్రబాబుకు ఈ ఎన్నికలు కీలకం
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ(T.D.P)కి ఈ ఎన్నికలు అత్యంత ప్రాణ ప్రతిష్టగా మారాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara chandrababunaidu) చేసిన ప్రతిజ్ఞ, మీడియా ముందు ఆయన పెట్టుకున్న కన్నీరు, పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన రాళ్లదాడి, పార్టీ నాయకులు, సీనియర్లపై నమోదైన కేసులు, ఏకంగా తనపై నమోదైన కేసులు.. ఇలా అనేక సమస్యల నుంచి వ్యక్తిగతంగా బయటపడాలంటే.. అధికారంలోకి వచ్చితీరాలనేది ఒక సంకల్పం. పైగా శపథం నిలబెట్టుకుని తీరాలి. దీనికితోడు కీలకమైన రాజధాని అమరావతిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని ఆవెంటనే రాజధానిని నిర్మించాలని భావిస్తున్నారు.
టీడీపీ-వైసీపీ పరస్పర విమర్శలు
ఇలా ఎటు చూసినా.. వైసీపీ(YSRCP), టీడీపీ(TDP)లకు ప్రస్తుతం జరగనున్న ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ అయినా.. అటు టీడీపీ అయినా.. వ్యక్తిగత విమర్శల నుంచి అనేక అంశాలను ప్రస్తావిస్తున్నాయి. అభివృద్ధి లేదని టీడీపీ అంటే.. సంక్షేమం కనిపించడం లేదా? అని వైసీపీ ఎదురు దాడి చేస్తోంది. రోడ్లు ఏవని టీడీపీ అంటే.. వేస్తున్నాం ఆగలేరా? అని వైసీపీ అంటోంది. ఇలా.. అనేక విషయాల్లో ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయ రణగొణ ధ్వని నింగినంటుతోంది.
ప్రజాసమస్యల ఊసుకు చోటేదీ?
అయితే.. ఎటొచ్చీ.. కీలకమైన.. ప్రజలకు అవసరమైన అంశాలపై మాత్రం ఈ పరస్పర బద్ధ వ్యతిరేక వైసీపీ, టీడీపీలు మాత్రం `కుమ్మక్కయ్యాయా?` అని అనేంతగా స్పందించడమే మానేశాయి. ఔను.. నిజమే. రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రత్యేక హోదా(Special Status)తో పాటు 2014లో విభజన చట్టంలో పేర్కొన్న హామీలపై కేంద్రంలోని ప్రభుత్వంపై పోరాడతామని, వాటిని సాధిస్తామని మచ్చుకైనా ఈ రెండు పార్టీలు అనడంలేదు. ఎందుకంటే.. హోదాపై గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసిందనే వాదన ఉంది. ఇక, విభజన హామీలపై పోరాడేందుకు ప్రయత్నించినా కేంద్రం సహకరించకపోవడంతో ఈ విషయంలోనూ ఈ రెండు పార్టీలూ చేతులెత్తేశాయి. కేంద్రం కరుణించినప్పుడే తీసుకుందామన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి.
కేంద్రముందు రెండు పార్టీలూ..
ఇక, కీలకమైన పోలవరం విషయాన్ని కూడా.. ఎన్నికల సమయంలో వైసీపీ, టీడీపీలు ప్రస్తావించే ఛాన్సే లేదు. ఎందుకంటే.. చంద్రబాబు(Chandra babu) హయాంలో పనులు పూర్తయ్యాయని ఆయన చెబితే.. కాదు మా హయాంలోనే పూర్తయ్యాయని జగన్ సర్కారు చెబుతోంది. దీనిపై కేంద్రం ఇచ్చే నిధుల విషయంలోనూ.. అంచనాల పెంపు విషయంలోనూ ఇప్పటికీ ఎడతెగని చర్చలే జరుగుతున్నాయి. దీంతో అనవసరంగా ఈ విషయాన్ని కెలికితే నష్టపోతామనేది ఇరు పార్టీల భావన.
వ్యక్తిగత ప్రయోజనమే అజెండా
అదేవిధంగా కడప ఉక్కు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ(Vishaka Steel) ప్రైవేటీకరణ, విశాఖ మెట్రో రైల్ ప్రాజక్టు, తెలంగాణతో ఏపీకి ఉన్న నీటి వివాదం వంటి విషయాలు ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తావనకు వచ్చే అవకాశం లేదు. ఇవి మినహా ఇతర అంశాలే ప్రచార వనరులుగా వైసీపీ, టీడీపీలు సై అంటే సై అంటున్నాయి. కానీ, వాస్తవానికి ప్రజలకు, రాస్ట్రానికి మేలు చేసేవి ఇవేనని మేధావులు చెబుతున్నారు. కానీ, రాజకీయాల్లో ప్రజా ప్రయోజనం కన్నా.. పార్టీలు, వ్యక్తుల ప్రయోజనాలకు పెద్దపీట వేయడం ఎప్పుడో ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పుడు మాత్రం దానికి అతీతంగా పార్టీలు, నాయకులు నడుస్తారా? ఇదీ.. సంగతి!