LK Advani Bharat Ratna: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీని అత్యున్నత పురస్కారమైన భారతరత్న వరించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రకటించారు. దేశ అభివృద్ధిలో ఆయన పాత్ర చాలా కీలకం అని ప్రశంసించారు. అద్వానీతో ఫోన్ చేసి మాట్లాడినట్టు వెల్లడించారు. తమ సమకాలీకుల్లో ఎంతో గౌరవప్రదమైన వ్యక్తి అంటూ కొనియాడారు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన ఆయన దేశానికి సేవ చేసేంత వరకూ ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకమని అన్నారు. 





"ఎల్‌కే అద్వానీకి భారతరత్న అవార్డు ఇస్తున్నట్టు ప్రకటించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడి అభినందించాను. దేశ అభివృద్ధిలో ఆయన పోషించిన పాత్ర ఎప్పటికీ మరిచిపోలేనిది. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన అద్వానీ డిప్యుటీ ప్రధాన మంత్రి స్థాయి వరకూ ఎదిగారు. హోం మంత్రిగానూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన చేపట్టిన బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చారు. ఆయన ఎంతో మందికి ఆదర్శనీయుడు"


- ప్రధాని నరేంద్ర మోదీ


ఇవి ఎంతో భావోద్వేగ క్షణాలు అని ప్రధాని మోదీ X లో పోస్ట్ చేశారు. ఎన్నో దశాబ్దాల పాటు ఆయన ప్రజాసేవ చేశారని ప్రశంసించారు. ఎప్పుడూ పారదర్శకంగా ఉండడంతో పాటు అందరినీ కలుపుకుపోతూ పని చేశారని అన్నారు. రాజకీయ విలువలకు ఆయన నిదర్శనం అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంలో ఉప ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఎల్‌కే అద్వానీ. ఆ తరవాత పలు మంత్రిత్వ శాఖల బాధ్యతలూ తీసుకున్నారు. 1970 నుంచి 2019 వరకూ పార్లమెంట్‌లోని రెండు సభలకూ ప్రాతినిధ్యం వహించారు. తనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుని ప్రకటించడంపై అద్వానీ సంతోషం వ్యక్తం చేసినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారని, కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపారు. పలువురు కేంద్రమంత్రులూ ఆయనకు అభినందనలు తెలిపారు. ఆయన సేవలకు తగని గుర్తింపు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. 







Also Read: LK Advani Political Journey: రథయాత్ర నుంచి భారతరత్న వరకూ, అద్వానీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు