janasena Chief Pawan Kalyan:  జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో తెగ వైరల్ అవుతోంది. ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారనే గాసిప్‌ ఇప్పుడు ట్రెండీగా మారిపోయింది. కాకినాడ స్థానం నుంచి పవన్ కల్యాణ్ లోక్‌సబ బరిలో ఉంటారని అంటున్నారు. అంతే కాదు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే పొత్తుల్లో భాగంగా బీజేపీ ఆయనకు మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. 


సీట్లపై చర్చలు


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి బరిలో నిలవాలని టీడీపీ, జనసేన ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాయి. రెండు పార్టీల అధినేతల ఇప్పటి వరకు పలు మార్లు సమావేశాలు కూడా అయ్యారు. అయితే సీట్ల విషయంలో చర్చలు నడుస్తున్నాయి. దీనిపై క్లారిటీ వస్తే ఒకే వేదికపై ఈ విషయాన్ని ప్రకటించబోతున్నారు. ఈ ప్రక్రియ సాగుతున్న టైంలో పవన్ పోటీపై కూడా కేడర్‌లో చాలా ఊహాగానాలు ఉన్నాయి. 


పవన్‌ పోటీ ఎక్కడ నుంచి 


మిగతా నాయకుల సంగతి పక్కన పెడితే.. పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే వార్త అందర్నీ తెగ డ్రిల్ చేస్తోంది. ఈ క్రమంలో చాలా నియోజకవర్గాలు తెరపైకి వచ్చాయి. పిఠాపురం అని ఒకసారి, తిరుపతి అని మరోసారి గాజువాక, భీమవరం అని ఇలా రకరకాల ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. ఇవేవి కాదని ఆయన ఇప్పుడు ఎంపీగా వెళ్లబోతున్నారనే వార్త ఇప్పుడు తాజాగా ట్రెండ్ అవుతోంది. 
టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్నప్పటి నుంచి పవర్ షేరింగ్ ఉండాలంటూ పవన్ ఫ్యాన్స్ పట్టుబడుతున్నారు. ఆయనకు మద్దతు ఇచ్చే నేతలు కూడా కొందరరు ఇదే విషయంపై మాట్లాడుతున్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రేపు ప్రభుత్వం ఏర్పాటు అయితే ఎలా అనే చర్చ కూడా నడుస్తోంది. రెండు పవర్ స్టేషన్‌లు ఒకే చోట ఉండటం ప్రమాదమని విశ్లేషకులు కూడా అంటున్నారు. 


ఢిల్లీకి పవన్ కల్యాణ్


ఇలాంటి సమస్య రాకుండా పవన్ కల్యాణ్‌ ఇప్పుడు ఢిల్లీపై దృష్టి పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఎలాగూ బీజేపీతో పవన్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. పొత్తులో ఉన్నామంటూ బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. అందులో భాగంగానే ఆయన్ని గెలిపించే బాధ్యతను జనసేన, టీడీపీ తీసుకుంటే.. తర్వాత కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని అంటున్నారు. ఇంకా దీనిపై మూడు పార్టీలో ఎవరూ స్పందించడం లేదు. 


కాకినాడ నుంచి పవన్ పోటీ! 


ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా పదే పదే పవన్ కల్యాణ్ కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పలుదఫాలు పర్యటించారు. ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశమయ్యారు. కేడర్‌తో కూడా చర్చించారు. ఎక్కడా పోటీ విషయాన్ని ప్రస్తావించకుండానే పరిస్థితులపై పవన్ కల్యాణ్ ఆరా తీసినట్టు చెప్పుకుంటున్నారు. దీనిపై ఇంకా చర్చలు నడుస్తున్నాయని... వారం పదిరోజుల్లో పవన్ పోటీపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. అప్పుడు కాని పవన్ వెళ్లేది అసెంబ్లీకా, పార్లమెంట్‌కా అనేది లేదు. 


కాకినాడే ఎందుకు !
కాకినాడ (Kakinada)లోక్‌సభ స్థానం నుంచి జనసేనాని పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉండే కాకినాడ సీటు సేఫ్టీగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన పదేపదే ఆ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే పర్యటిస్తున్నారని తెలిసింది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌పై పవన్ ఒంటికాలుపై లేవడానికి కారణం కూడా ఇదేనని చెబుతున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సీట్లలో జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉన్నట్లు అన్ని సర్వేల్లో తేలింది. కాబట్టి పవన్ ఇక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని తేలిపోవడంతో...పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ప్రధాని మోదీ‍ (Narendra Modi) వద్ద తనకు ఉన్న పలుకుబడితో పవన్ కావాలనుకుంటే ఎప్పుడో కేంద్రమంత్రి అయ్యిండే వారు కానీ....ప్రజాబలంతో గెలిచే చట్టసభల్లో అడుగుపెట్టాలని ఆయన బలంగా నిర్ణయించుకున్నారు. కావున లోక్‌సభ బరిలో దిగుతున్నారని తెలుస్తోంది. ప్రధాని మోదీ నుంచి కేంద్రమంత్రి పదవిపై హామీ వచ్చిన తర్వాతే ఆయన లోక్‌సభ బరిలోదిగుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.