No Sugar Diet Benefits: షుగర్ తియ్యగా బాగుంటుంది. కానీ, మోతాదు మించితేనే అసలు సమస్య. మన డైలీ లైఫ్‌లో చక్కెర కూడా భాగమైంది. ఉదయం నిద్ర లేచినప్పుడు కాఫీ తాగడంతో మొదలు పెడితే రాత్రి పడుకొనే సమయంలో తినే డిసర్ట్స్ వరకు ఏదో ఒక రూపంలో తీపిని తినేస్తుంటాం. చక్కెరలో ఎక్కువ శాతం క్యాలరీలు ఉంటాయి. అందుకే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు చక్కెర వాడకూడదని, దానికి బదులుగా ఇతర తీపి పదార్థాలను వాడాలని సూచిస్తూ ఉంటారు. చక్కెరను పూర్తిగా మానేస్తే ఇంకా మంచిదంటారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులతోపాటు ఆరోగ్యం పట్ల స్పృహ ఉన్నవారు సైతం పంచదారను ఎక్కువగా ఉపయోగించకూడదని  డైటీషియన్లు చెబుతూ ఉంటారు. 


ప్రముఖ బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ఇటీవల తన డైట్ సీక్రెట్‌ను మీడియాతో పంచుకున్నాడు. అతను ఒక సంవత్సరం కాలం పాటు పంచదారకు దూరంగా ఉన్నట్లు తెలిపాడు. తీపి కోసం తాను పంచదార బదులుగా ప్రత్యామ్నాయ సహజ ఉత్పత్తులను వాడినట్టు కొన్ని సీక్రెట్స్ బయట పెట్టాడు. దీనివల్ల అతని శరీరంలో ఎలాంటి మార్పులు జరిగాయో తెలిపాడు. అవేంటో చూసేయండి మరి. 


పంచదార మానేయడం వల్ల పాజిటివ్ రిజల్ట్స్:


పంచదార మానేయడం వల్ల శరీరంలో చాలావరకు పాజిటివ్  మార్పులే చోటుచేసుకుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రారంభంలో పంచదార తినకపోతే కాస్త నీరసంగా అనిపించే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ అకస్మాత్తుగా మానేసినప్పుడు ఏర్పడే విత్ డ్రాయల్ సింప్టమ్స్ తరహాలోనే పంచదార మానేసిన వారిలో అలాంటి లక్షణాలు కనిపిస్తాయట. నీరసంతోపాటు మానసికంగా కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుందట. అయితే శరీరంలో మెటబాలిజం మాత్రం పెరుగుతుంది. ఫలితంగా ఊబకాయం నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది. అలాగే చర్మానికి సంబంధించినంత వరకు చక్కెర మానేయడం అనేది ఒక రకంగా చాలా లాభదాయకమైన చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరికైతే స్కిన్ ఎలర్జీ లేదా మొటిమలు ఉంటాయో వారు పంచదార మానివేయడం వల్ల ఆ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.


గుండె ఆరోగ్యం బాగుంటుంది: 


పంచదార పూర్తిగా మానివేయడం వల్ల మీ గుండె ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ముఖ్యంగా రక్తపోటు తగ్గిస్తుంది. దీంతోపాటు గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఒక టీ స్పూన్ పంచదారలో 20 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. పంచదారను మానేయడం వల్ల మీ శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. తద్వారా టైప్ 2 డయాబెటిస్ నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది. అలాగే పంచదార మానివేయడం వల్ల మీ దంత ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ముఖ్యంగా చిగుళ్ల వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. 


మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది: 


పంచదార మానివేయడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా బాగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  షుగర్ ఎక్కువగా తీసుకున్నట్లయితే వాపు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్ తగ్గించడం వల్ల ఈ వ్యాధుల నుంచి బయటపడవచ్చు. కార్తీక్ ఆర్యన్ పంచదారకు బదులుగా సహజ పద్ధతుల్లో తయారు చేసిన బెల్లం, ఇతర సహజ స్వీటనర్లను వాడటం ద్వారా తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లు చెబుతున్నాడు. చక్కెరను తగ్గించుకునేందుకు స్వీట్లు, కేకులు, కూల్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులు మానివేయాల్సి ఉంటుంది. 


Also Read : ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీ గుండె పదిలంగా ఉంటుంది






















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.