Tamil Actor-cum-Politicians: సినీ ప్రముఖులు పాలిటిక్స్ లోకి రావడమనేది కొత్తేమీ కాదు. ఎందుకంటే సినిమాలకు, రాజకీయాలకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. భారతీయ చిత్ర పరిశ్రమలో అనేక మంది యాక్టర్లు రాజకీయ రంగ ప్రవేశం చేసి, ప్రజాసేవ చేశారు. ముఖ్యంగా దక్షిణాదిలో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. వెండితెరను ఏలిన చాలామంది కథానాయకులు, తర్వాతి కాలంలో రాజకీయాల్లో 'నాయకులు'గా ఓ వెలుగు వెలిగారు. వారిలో కొందరు సొంతంగా పొలిటికల్ పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్తే, మరికొందరు ఇతర పార్టీలలో చేరి పాలిటిక్స్ చేశారు. అయితే మన దేశంలో అత్యధికంగా తమిళనాడు రాజకీయాల్లోనే సినీ తారల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు లేటెస్టుగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ ప్రకటించడంతో మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది. అన్నాదొరై, ఏంజీఆర్ నుంచి కమల్ హాసన్, విజయ్ వరకూ.. రాజకీయాల్లోకి వచ్చిన తమిళ నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.


రాజకీయ నాయకులుగా మారిన కోలీవుడ్‌ యాక్టర్స్ ఎవరంటే...


సీఎన్ అన్నాదొరై:
కంజీవరం నటరాజన్ అన్నాదురై.. స్వతంత్ర భారత దేశంలో కొన్ని తమిళ సినిమాల్లో హీరోగా నటించడంతో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే రైటర్‌గా కూడా వర్క్‌ చేశారు. పెరియార్ ఇ.వి.రామస్వామికి అనుయాయిగా పేరున్న ఆయన, ద్రవిడ కళగం పార్టీలో ఉన్నత స్థానానికి ఎదిగారు. ప్రత్యేక ద్రవిడనాడు రాష్ట్ర ఉద్యమానికి, రాజకీయాలకు పరిచయం సినిమాలని వాడుకున్నారు. అయితే పెరియార్ తో తలెత్తిన అభిప్రాయాభేదాల కారణంగా బయటకి వచ్చి, 1949లో 'ద్రవిడ మున్నేట్ర కళగం' (DMK) పార్టీని స్థాపించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా, తమిళనాడు రాష్ట్రానికి మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా అన్నాదొరై చరిత్రకెక్కారు. 


శివాజీ గణేశన్:
'నడిగర్ తిలకం' శివాజీ గణేశన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు సినీ కెరీర్ ను కొనసాగించిన ఆయన, 250 చిత్రాలలో ప్రధాన పాత్ర పోషించిన ఏకైక తమిళ నటుడుగా రికార్డ్ క్రియేట్ చేశారు. డీఎంకే పార్టీలో చేరిన శివాజీ.. అప్పట్లో తిరుపతి ఆలయాన్ని సందర్శించడంపై విమర్శలు రావడంతో బయటకు వచ్చి, తమిళ నేషనల్ పార్టీలో చేరారు. ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్‌, కాంగ్రెస్ (ఓ), జనతాదళ్ పార్టీల్లో పనిచేశారు. ఇందిరాగాంధీ హయాంలో ఆయన రాజ్యసభ సభ్యునిగా చేశారు. 1988–1989 కాలంలో సొంతంగా తమిళగ మున్నేట్ర మున్నాని అనే రాజకీయ పార్టీని స్థాపించారు.


ఎంజీఆర్:
తమిళనాడు సినీ రాజకీయాలలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి మరుదూర్ గోపాలన్ రామచంద్రన్. 1953 వరకు కాంగ్రెస్‌లో ఉన్న ఎంజీఆర్, అన్నాదొరై స్ఫూర్తితో డీఎంకేలో చేరారు. అయితే కరుణానిధి డీఎంకే నాయకత్వ బాధ్యతలు చేపట్టి సీఎం అయిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఎంజీఆర్‌ను బహిష్కరించారు. దీంతో ఎంజీఆర్ తన బంధువు ప్రారంభించిన అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ADMK) లో చేరారు. ఆ తర్వాత అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) పార్టీని స్థాపించారు. 1977 - 1987 మధ్య కాలంలో రెండుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసి, మరణించే వరకు ఆ పదవిలో ఉన్నారు. మరణానంతరం ఆయనకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న లభించింది.


వీఎన్ జానకీ రామచంద్రన్:
ఎంజీఆర్ సతీమణి జానకి రామచంద్రన్ కొన్ని సినిమాల్లో నటించారు. భర్త ఎఐఎడిఎంకె పార్టీ పెట్టినప్పటికీ, ఆమె రాజకీయాల్లో చురుకుగా పాల్గొనలేదు. 1984లో ఎంజీఆర్ కు పక్షవాతం వచ్చినప్పుడు, పార్టీకి మధ్యవర్తిగా వ్యవహరించారు. 1987లో భర్త మృతి చెందడంతో ఆయన స్థానంలో జానకి పార్టీ బాధ్యతలు చేపట్టి 23 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తమిళనాడు మొదటి మహిళా ముఖ్యమంత్రిగా, భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రి అయిన మొదటి నటిగా రికార్డుకెక్కారు.


జయలలిత:
పురట్చి తలైవి జయలలిత తమిళ రాజకీయాల్లో పెను సంచలనమనే చెప్పాలి. 140కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె, 1982లో ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీలో చేరారు. MGR మరణానంతరం జానకీ రామచంద్రన్ నేతృత్వంలోని వర్గానికి వ్యతిరేకంగా పోరాడింది. ఎన్నో సమస్యలు ఎదుర్కొని, తన బలమైన నాయకత్వంతో మళ్లీ పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టుకొని అన్నాడీఎంకేకు ఏకైక నాయకురాలిగా ఎదిగారు. 1991 - 2016 మధ్య కాలంలో జయలలిత ఆరుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు.


విజయకాంత్:
కొన్నేళ్ల పాటు సినీ అభిమానులను అలరించిన కెప్టెన్ విజయ్ కాంత్, 2005లో దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) అనే పార్టీని స్థాపించారు. 2011 నుంచి 2016 వరకు ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తమిళ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు కానీ, తన పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు. విజయకాంత్ 2023 డిసెంబర్ 28న కన్నుమూశారు.


శరత్‌ కుమార్:
సీనియర్ నటుడు శరత్‌ కుమార్ సైతం రాజకీయాల్లో ప్రవేశించారు. 2007లో తమిళనాడులో ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి (AISMK) అనే సొంత పార్టీని స్థాపించాడు. రాజకీయవేత్త కె. కామరాజ్ విలువలను పాటిస్తామని ప్రకటించుకున్నాడు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు.


కమల్ హాసన్:
గత కొన్ని దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తున్న విశ్వ నటుడు కమల్ హాసన్.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. 2018లో ‘మక్కల్ నిధి మాయం’ పార్టీని స్థాపించారు. 2019 లోక్‌సభ ఎన్నికలల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పటికీ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు.


ఖుష్బు & గౌతమి:
సీనియర్ నటి ఖుష్బు గత 14 ఏళ్లుగా తమిళనాడు రాజకీయాల్లో ఉన్నారు. 2010లో డీఎంకేలో పార్టీలో చేరి, నాలుగేళ్లలోనే కాంగ్రెస్‌లోకి వచ్చి చేరారు. ఆ తర్వాత 2020లో బీజేపీలో చేరి, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. మరో సీనియర్ నటి గౌతమి సైతం పాలిటిక్స్ లోకి వచ్చారు. 1997 నుంచి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. 


ఉదయనిధి స్టాలిన్:
దివంగత కరుణానిధి మనవడు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. గత ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి డీఎంకే పార్టీ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఎంఎల్ఏగా గెలిచి తమిళనాడు శాసనసనలో అడుగుపెట్టారు. ప్రస్తుతం తన తండ్రి క్యాబినెట్‌లో యువజన సంక్షేమం & క్రీడాభివృద్ధి శాఖామంత్రిగా ఉదయనిధి స్టాలిన్ కొనసాగుతున్నారు. చివరిగా 'నాయకుడు' వంటి పొలిటికల్ డ్రామాలో హీరోగా నటించిన అతను, ఇకపై రాజకీయాలకే పరిమితం కానున్నట్లు ప్రకటించారు.


దళపతి విజయ్:
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్ కూడా ఇప్పుడు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ప్రచారంలో ఉన్న వార్తలను నిజం చేస్తూ, ఫిబ్రవరి 2న 'తమిళగ వెట్రి కళగం' (TVK) అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. ఆల్రెడీ కమిటైన రెండు సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా ప్రజా సేవకే అంకితం కాబోతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే తమిళనాడు లోక్‌ సభ ఎన్నికల్లో విజయ్‌ పోటీ చేయనున్నారు.


ఇకపోతే రాధా రవి, సీమాన్, టి. రాజేందర్, తంబి రామస్వామి, కరుణాస్, ఎంఆర్ కృష్ణన్ వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా రాజకీయాలలో ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పాలిటిక్స్ లోకి రావాలని భావించారు. అయితే తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. 


Also Read: పూనమ్ పాండే నటించిన ఏకైక తెలుగు సినిమా ఇదే!