Poonam Pandey: బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్‌ పాండే (32) మృతి చెందింది. పూనమ్‌ ఇకలేరంటూ ఈరోజు శుక్రవారం ఉదయం ఆమె ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేసిన మరణ వార్త, సినీ వర్గాలను విస్మయానికి గురి చేసింది. గత కొంతకాలంగా సర్వైకల్‌ క్యాన్సర్‌ (గర్భాశయ సంబంధిత)తో పోరాడుతున్న ఆమె, గురువారం రాత్రి కన్నుమూసినట్లుగా వ్యక్తిగత సిబ్బంది కన్ఫర్మ్ చేసారు. ఈ వార్త విన్న అభిమానులు షాక్‌కు గురవ్వుతున్నారు. ఇంత చిన్న వయసులోనే కన్ను మూయడం బాధాకరం అని చింతిస్తున్నారు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో పూనమ్‌కు సంబంధించిన వార్తలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. 


మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన పూనమ్‌ పాండే, 2013లో ‘నషా’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌లో తెరంగ్రేటం చేసింది. అంతకముందు 'ది అన్ క్యానీ' అనే షార్ట్ ఫిలింలో నటించింది. 'లవ్ ఈజ్ పాయిజన్' అనే కన్నడ మూవీలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చిన పూనమ్.. 'అదాలత్' అనే భోజ్ పురి సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఇదే క్రమంలో 'ఆగాయా హీరో', 'జీఎస్టీ - గల్తీ సిర్ఫ్ తుమ్హారీ', 'ది జర్నీ ఆఫ్ కర్మ' వంటి హిందీ చిత్రాల్లో నటించింది. అయితే మధ్యలో ఆమె ఓ తెలుగు సినిమా ద్వారా టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిందనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. 


2015లో ‘మాలిని & కో.’ అనే తెలుగు చిత్రంలో నటించింది పూనమ్ పాండే. సుమన్, సామ్రాట్ రెడ్డి, రవికాలే, జీవా లాంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వీరు. కె దర్శకత్వం వహించారు. ఇందులో మాలిని పాత్రలో పూనమ్ కనిపించింది. కథేంటంటే, మాలిని ముంబైలో ఒక మసాజ్ పార్లర్ రన్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో అదే ప్రాంతంలో నివసిస్తున్న తమిళులపై దాడి చెయ్యడానికి శ్రీలంకకి చెందిన మిలిటెంట్స్ ప్లాన్ చేస్తారు. బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ముంబైలో అడుగుపెట్టిన మిలిటెంట్స్ గ్రూప్ అక్కడ మాలిని చూసి షాక్ అవుతారు. ఇంతకీ ఈ మాలిని ఎవరు? ఆమె గతం ఏంటి? టెర్రరిస్ట్ అటాక్స్ తో ఆమెకున్న సంబంధం ఏంటి? అనేదే ఈ సినిమా. 


పూనమ్ పాండేకి నేషనల్ వైడ్ ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోడానికి తీసిన మసాలా యాక్షన్ సినిమా ‘మాలిని అండ్ కో’. ఇది ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పూనమ్ తన గ్లామరస్ తో, అందచందాలతో నిలబెట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. స్కిన్ షో తప్ప గ్రిప్పింగ్ పాయింట్ లేకపోవడంతో పరాజయం మూటగట్టుకుంది. దీంతో పూనమ్ తెలుగులో ఆ ఒక్క సినిమాకే పరిమితం కావల్సి వచ్చింది. ఇక ఆమె బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హోస్ట్ గా చేసిన 'ఫియర్ ఫాక్టర్: ఖాత్రోన్ కే ఖిలాడీ 4' రియాలిటీ గేమ్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది. అలానే నటి కంగనా రనౌత్‌ హోస్ట్‌గా వ్యవహరించిన 'లాకప్‌' ఫస్ట్ సీజన్‌లోనూ పాల్గొంది. 


నిజానికి పూనం పాండే సినిమాలతో కంటే కాంట్రవర్సీలతోనే బాగా పాపులారిటీ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. 2011 వన్డే క్రికెట్ ప్రపంచకప్‌ టోర్నీ టైంలో ఆమె చేసిన ఓ ప్రకటన సంచలనంగా మారింది. టీమిండియా కప్ గెలిస్తే, జట్టు కోసం తన బట్టలు విప్పుతానని ప్రకటించడం మీడియా దృష్టిని ఆకర్షించింది. భారత్ కప్ గెలిచినా ప్రజల అసమ్మతి కారణంగా తన వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు బీసీసీఐ అనుమతి నిరాకరించిందని పాండే పేర్కొంది. అయినప్పటికీ ఆరోజు రాత్రి వాంఖడే స్టేడియంలో న్యూడ్ గా ఉన్న ఒక వీడియోను తన మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేసింది. అలానే 2012లో కోల్‌కతా నైట్ రైడర్స్ IPL గెలుచుకున్న తర్వాత కూడా ఆమె నగ్నంగా పోజులిచ్చింది. అప్పట్లో పూనమ్ పాండే వైవాహిక జీవితం కూడా వివాదాస్పదమైంది. భర్త తనను శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించడం, ఆ తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకోవడం కొన్నాళ్లపాటు హాట్ హాపిక్ గా నడిచింది. ఏదేమైనా పూనమ్ మూడు పదుల వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం బాధాకరం. 


Also Read: రాజమౌళి - మహేష్ బాబు సినిమాలో నాగార్జున? ఈ క్రేజీ కాంబోపై రెండేళ్ల క్రితమే హింట్?