Kejriwal on Centre's Ordinance: 


కేసీఆర్‌తో భేటీ..


ఢిల్లీ పాలనా వ్యవహారాలపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా...దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనిపై కేజ్రీవాల్ సర్కార్ పోరాటం చేస్తోంది. బీజేపీయేతర పార్టీల మద్దతు కూడగడుతోంది. ఆ ఆర్డినెన్స్‌ని వెనక్కి తీసుకునేందుకు వరకూ పోరాటం చేస్తామని తేల్చి చెబుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిశారు. బీజేపీపై పోరాటానికి మద్దతు కోరారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీయేతర పార్టీలన్న ఒక్కటై మోదీ సర్కార్‌పై యుద్ధానికి సహకరించాలని కోరారు. తమకు మద్దతు తెలిపిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 


"సుప్రీంకోర్టు తీర్పుని కూడా లెక్క చేయని ప్రధాని మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఇలాంటి ప్రధాని ప్రజలకు ఏం న్యాయం చేస్తారు..? కాంగ్రెస్ హయాంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా చాన్నాళ్లు షీలా దీక్షిత్ పని చేశారు. అప్పట్లో పాలనా వ్యవహారాలన్నీ ఆమె చేతిలోనే ఉండేవి. కానీ మోదీ సర్కార్ ఆర్డినెన్స్‌తో ఆ అధికారాలన్నీ మా చేజారిపోయాయి. మా న్యాయ పోరాటం ఫలించి సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ జోక్యం చేసుకోకూడదని తేల్చి చెప్పింది. అయినా...వారం రోజుల్లోనే కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. బీజేపీ తీరే ఇంత. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తుంది. అధికారపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంది. గవర్నర్‌ని అడ్డం పెట్టుకుని అధికారాలను దుర్వినియోగం చేస్తుంది"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం


ఏ రాష్ట్రంలో అయినా...బీజేపీ కాకుండా మరే పార్టీ అధికారంలోకి వచ్చినా మోదీ సర్కార్ కక్ష కడుతోందని మండి పడ్డారు కేజ్రీవాల్. ఏదో రకంగా అలజడి సృష్టిస్తుందని విమర్శించారు. రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేదని, ప్రతిపక్షాలన్నీ ఒక్కటైతే పోరాటం పెద్ద కష్టమేమీ కాదని తేల్చి చెప్పారు. 


"ఏదైనా రాష్ట్రంలో బీజేపీ కాకుండా మరే పార్టీ అధికారంలోకి వచ్చినా మోదీ సర్కార్ ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. ఢిల్లీలోని పాలనా వ్యవహారాలన్నీ కేంద్రమే నిర్ణయిస్తే...ఇక ప్రజలు సీఎంని ఎన్నుకుని ప్రయోజనమేముంది..? రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేదు. ప్రతిపక్షాలన్నీ ఒక్కటైతే పోరాడటం సులువవుతుంది. 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇదే సందేశమివ్వాలి. నేను కేవలం నా కోసమే మద్దతు కోరడం లేదు. దేశం కోసం అడుగుతున్నాను"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం






అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ కూడా వచ్చారు. ఆయన కూడా బీజేపీ సర్కార్‌పై మండి పడ్డారు. రాజ్‌భవన్‌ని బీజేపీ కార్యాలయంగా మార్చేస్తున్నారని విమర్శించారు. 


"ఢిల్లీలో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాదు. ఢిల్లీలోనే కాదు. మా ప్రభుత్వాన్నీ కేంద్రం ఇలాగే ఇబ్బంది పెడుతోంది. రాజ్‌భవన్‌ బీజేపీ ఆఫీస్‌లా తయారవుతోంది. వాళ్లే బీజేపీకి స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇవాళ నీతి ఆయోగ్ సమావేశం నిర్వహించారు. అందరితోనూ మాట్లాడతారు. కానీ వాళ్లకు నచ్చిందే చేస్తారు":


- భగవంత్ మాన్, పంజాబ్ ముఖ్యమంత్రి 


Also Read: Karnataka Cabinet: సిద్దరామయ్య వద్దే ఆర్థిక శాఖ, డీకే శివకుమార్‌కి నీటి పారుదల - కర్ణాటక కేబినెట్‌ విస్తరణ