Karnataka Cabinet:
24 మంది ప్రమాణ స్వీకారం..
కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారం రోజులకు కాంగ్రెస్ కేబినెట్ విస్తరణ చేపట్టింది. ఇందులో భాగంగా 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరెవరికి ఏ పోర్ట్‌ఫోలియో ఇస్తారో అన్న ఇన్నాళ్లు ఉత్కంఠకు తెర పడింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకున్నారు. ఇంటిలిజెన్స్ విభాగమూ సిద్దరామయ్యకే కేటాయించారు. ఇక ముఖ్యమంత్రి రేసులో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించిన జి పరమేశ్వరకు మంచి పదవే కట్టబెట్టారు. హోం మంత్రి బాధ్యతలు అప్పగించారు. డిప్యుటీ సీఎం డీకే శివ కుమార్‌కి భారీ, మధ్య తరహా నీటిపారుదల శాఖను కేటాయించారు. దీంతో పాటు బెంగళూరు సిటీ డెవలప్‌మెంట్ బాధ్యతలూ ఇచ్చారు. హెచ్‌కే పాటిల్ లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాలు, దినేశ్ గుండు రావ్‌కి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కృష్ణ బైరె గౌడకు రెవెన్యూ శాఖలు కేటాయించారు. కర్ణాటక ప్రభుత్వంలో మొత్తం 34 మంది మంత్రులు ఉంటారు. గత వారమే 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ లిస్ట్‌ని ఫైనలైజ్ చేసే ముందు సిద్దరామయ్య, డీకే శివ కుమార్ హైకమాండ్‌తో విస్తృత చర్చలు జరిపారు. దాదాపు మూడు రోజులుగా అక్కడే ఉన్నారు. మంత్రులుగా ఎవరికి అవకాశం ఇవ్వాలో తుది నిర్ణయం తీసుకుని...ఆ జాబితా విడుదల చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ లిస్ట్‌ని ఫైనలైజ్ చేశారు. అయితే...ఈ విషయంలో సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య కాస్త విభేదాలు తలెత్తినప్పటికీ చివరకి ఇద్దరూ వెనక్కి తగ్గారు. ఆ తరవాత సోనియా గాంధీని కలిసి ఆ జాబితాకి ఆమోద ముద్ర వేయించుకున్నారు.