వివేక హత్య కేసులో అవినాష్ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఉదయం నుంచి వాదనలు వినిపిస్తున్న సీబీఐ కీలక విషయాలపై క్లారిటీ ఇస్తోంది. ఈ హత్య కేసులో కీలకంగా మారిందన్న లేఖపై నోరు విప్పింది సీబీఐ. అవినాష్‌ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన బహిరంగ లేఖ విడుదల చేసినా ఆ లేఖ ఆధారంగా దర్యాప్తు చేయడం లేదు ఎందుకని ప్రశ్నించే వారు. 


లెటర్‌ దాయడంలో కుట్ర లేదు


లెటర్‌పై అవినాష్‌ రెడ్డి వ్యక్తం చేస్తున్న అనుమానాలు నివృత్తి చేస్తూ కోర్టులోక కీలక వాదనలు వినిపించింది సీబీఐ. వివేక హత్య కేసు రోజున దొరికిన లేఖ దాయడంలో ఎలాంటి కుట్ర లేదని తేల్చేసింది సీబీఐ. సేఫ్లీ కోసమే ఆ లెటర్‌ను దాచి పెట్టమన్నారని తేలిందన్నారు. దాన్ని స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించామన్నారు. అందులో ఉన్న హ్యాండ్ రైటింగ్‌ వివేకదేనని స్పష్టమైనట్టు పేర్కొన్నారు. 


పోలీసుల బదిలీలపై చాటింగ్


వివేక హత్య జరిగిన తర్వాత ప్రభుత్వం సిట్ వేసిందని కోర్టుకు సీబీఐ గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసుల బదిలీలు, నియామకాలు జరిగాయన్నారు. దీనికి సంబంధించి అవినాష్,శివశంకర్‌ వాట్సాప్‌ చాట్ ఉందని సీబీఐ పేర్కొంది. హత్య జరిగిన తర్వాత అంతక ముందు కూడా చాలా వాట్సాప్ చాట్‌లు, కాల్స్‌తో సంభాషణలు జరిగాయంది సీబీఐ. 


సీబీఐని ప్రశ్నించిన న్యాయమూర్తి 


ఈ వాదనల సందర్భంగా పలు ప్రశ్నలను న్యాయమూర్తి సీబీఐని అడిగారు. పోస్టుమార్టం కోసం ఇంటి నుంచి తీసుకెళ్లినప్పుడు డాక్టర్ ఉన్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఉదయం 9.30కి ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారని అవినాష్‌ న్యాయవాది సమాచారం ఇచ్చారు. అదే టైంలో వివేక హత్యపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని శంకరయ్యకు సునీత భర్త రాజశేఖర్‌ రెడ్డి చెప్పారని న్యాయస్థానానికి సీబీఐ చెప్పింది. అవినాష్ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి ఎవరూ వివేక హత్యపై ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. 


చంపాల్సిన అవసరం ఏముంది?


నిందితుడు అవినాష్ ఇంట్లో ఉన్నారని ఎలా చెబుతున్నారని సీబీఐ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ఆధారాల సేకరణకు ఎందుకు ఆలస్యమైందని కూడా అడిగింది. లోక్‌సభ అభ్యర్ధిత్వం కోసమే వివేకా హత్య జరిగిందని ఎలా చెబుతున్నారని క్వశ్చన్ చేసింది. లోక్ సభ అభ్యర్ధిగా అవినాష్‌ను అనధికారికంగా ముందే ప్రకటించారని.. చార్జ్‌ షీట్‌లో చాలా మంది స్టేట్‌మెంట్‌లు అలానే ఉన్నారని గుర్తు చేసింది. అవినాష్‌ అభ్యర్ధిత్వాన్ని అందరూ సమర్ధించినట్లు స్టేట్‌మెంట్లు ఉన్నాయి కదా అని అడిగింది. అవినాష్‌ది చాలా బలమైన కుటుంబ నేపథ్యమని మీరే అంటున్నారు.. అలా అయితే... 2017 ఎమ్మెల్సీ ఎన్నికలను మేనేజ్‌ చేసి ఉండొచ్చు కదా అని అనుమానం వ్యక్తం చేసింది. వివేకాను చంపాల్సిన అవసరం  ఏముందని ప్రశ్నించింది. 


భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డి అరెస్ట్‌కు కారణాలేంటీ...? కస్టడీలో ఇద్దరి నుంచి ఏం తెలుసుకున్నారు..? అని సిబీఐని ప్రశ్నించింది కోర్టు. వాళ్లిద్దరు కూడా విచారణకు సహకరించడం లేదని చెప్పారు సీబీఐ న్యాయవాది. 


ఈ కేసులో జాప్యం చేసి లబ్ది పొందాలని అవినాష్ రెడ్డి చూస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. విచారణకు పిలిచినప్పుడల్లా ఏదో కారణంతో గైర్హాజరు అవుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారని సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అనిల్‌ వాదనలు వినిపించారు. 


వివేక హత్య కేసు విచారణకు అవినాష్ రెడ్డి అసలు సహకరించడం లేదని దర్యాప్తులో మొదటి నుంచీ అడుగడుగునా అడ్డుకుంటున్నారని వాదించింది సీబీఐ. దర్యాప్తును ఓ పద్దతి ప్రకారం చేస్తున్నామని వివరించారు. విచారణ అవినాష్‌కు నచ్చినట్టు చేయబోమన్నారు. ఇప్పటి వరకు చాలా మందిని విచారించామన్న సీబీఐ కొందర్ని అరెస్టు చేసినట్టు పేర్కొంది. కానీ అవినాష్‌ రెడ్డి మొదటి నుంచి విచారణకు సహకరించడం లేదని మిగతావారికి లేని ప్రత్యేకత అవినాష్‌కు ఎందుకని ప్రశ్నించారు. 


సాధారణ కేసుల్లో ఇంత సమయం తీసుకుంటారా అని ప్రశ్నించారు వెకేషన్ బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణ్‌. వివేక హత్య కేసులో చాలా కారణాలు తెరపైకి వస్తున్నాయని. అసలు ప్రధాన కారణమేంటని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా సీబీఐ తరఫు న్యాయవాది వాదిస్తూ రాజకీయ ఉద్దేశాలే ఈ హత్యకు ప్రధాన కారణమని తేల్చారు. హత్యకు నెలరోజుల ముందు నుంచే కుట్ర ప్రారంభమైందన్నారు.