Delhi Air Pollution:
తగ్గిపోయిన గాలి నాణ్యత..
దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. శీతాకాలం మొదలైనప్పటి నుంచే ఇక్కడి ప్రజలకు కష్టాలు మొదల య్యాయి. గాలి పీల్చుకునేందుకు అనువైన పరిస్థితులు లేకుండా పోయాయి. ఇప్పటికే ప్రభుత్వం ఎయిర్ క్వాలిటీని మెరుగు పరిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అత్యవసర నిర్మాణాలు తప్ప నగర వ్యాప్తంగా ఎక్కడ నిర్మాణ పనులు జరగకుండా ఆంక్షలు విధించింది. ప్రజా రవాణానే ఎక్కువగా వినియోగించుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ మరీ దారుణంగా పడిపోవడం వల్ల కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలని సూచించింది. ఒక్కొక్కరు ఒక్కో కార్ బయటకు తీయకుండా కార్ పూలింగ్ పద్ధతిని అనుసరించాలని చెప్పింది. తద్వారా కాలుష్యాన్ని కట్టడి చేయొచ్చని పేర్కొంది. శుక్రవారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 399గా నమోదైంది.
సాధారణంగా..AQI 201-300 వరకూ ఉంటే..."Poor"గా పరిగణిస్తారు. 301-400గా నమోదైతే "Very Poor"గా లెక్కిస్తారు. 401-500 గా ఉంటే... "Severe"గా తేల్చి చెబుతారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ సీవియర్ కేటగిరీకి పడిపోయే ప్రమాదముందని ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ అంచనా వేసింది. దాదాపు రెండ్రోజుల పాటు "Severe"గానే వాయు నాణ్యత ఉండే అవకాశముందని తెలిపింది. ఒకవేళ ఇది సివియర్ ప్లస్‌గా మారితే మాత్రం...ఢిల్లీలోకి ట్రక్‌లు రాకుండా ఆంక్షలు విధిస్తారు. విద్యాసంస్థలు బంద్ చేయిస్తారు. సరి, భేసి విధానంలో వాహనాలను రోడ్లపైకి వచ్చేలా కొత్త నిబంధనలు అమలు చేస్తారు. అయితే...BS-3 పెట్రోల్, BS-4 డీజిల్ కార్లపై నిషేధం విధించే విషయంలో ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిర్మాణ పనులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. గాలిని కలుషితం చేయని ప్లంబింగ్, కార్పెంటరీ, ఇంటీరియర్ డెకరేషన్, ఎలక్ట్రికల్ వర్క్ లాంటి వాటిపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఢిల్లీ-NCR పరిధిలో పరిశ్రమలేవైనా బొగ్గుతో నడపడంపై జనవరి 1 నుంచి నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
తరచూ ఆంక్షలు..
ప్రస్తుతానికి Graded Response Action Plan (GRAP) స్టేజ్ 3 నిబంధనలు అమలు చేస్తున్నారు. పలు చోట్ల నిర్మాణాలపై నిషేధం విధించారు. వాహనాలూ ఎక్కువ మొత్తంలో తిరగకుండా ఆంక్షలు విధించారు. BS-3, BS-4 వాహనాలు రోడ్లపై తిరగకూడదని ప్రభుత్వం గతంలో ఆదేశాలిచ్చింది. కొద్ది రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగాయి. ఆ సమయంలో ఈ నిబంధన ఉల్లంఘించిన 5,800 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 5,882 వాహనాలపై చలానాలు విధించినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి మోటార్ వాహనాల చట్టం కింద రూ.20 వేల జరిమానా విధిస్తామని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీ కాలుష్య సమస్య రోజురోజుకీ సంక్లిష్టమవుతోంది. ఎయిర్ క్వాలిటీ పడిపోతూ వస్తోంది. మరోసారి అక్కడి గాలి నాణ్యత "అత్యంత ప్రమాదకర స్థాయికి" చేరుకుందని అధికారులు వెల్లడించారు.