Covid-19 Scare China:


జనవరిలో వేల సంఖ్యల మరణాలు..


చైనాలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. మరణాలూ భారీగానే నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే...ఇదంతా ఆరంభం మాత్రమేనని...అసలు కథ ముందుందని అంటున్నారు నిపుణులు. మరి కొద్ది రోజుల్లో ఇంత కన్నా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరో 13 రోజుల పాటు కరోనా కేసులు ఉన్నట్టుండి పెరిగిపోతాయని
చెబుతున్నారు. అంతే కాదు. గత రికార్డులను బద్దలు కొట్టే స్థాయిలో కేసులు నమోదవుతాయట. యూకేలోని ఆరోగ్య రంగ నిపుణులు చైనాలో ఏ స్థాయిలో కేసులు నమోదవుతాయో అంచనా వేస్తున్నారు. జనవరి 13వ తేదీన కరోనా అనూహ్య స్థాయిలో వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. అప్పటికి కరోనా బాధితుల సంఖ్య 37 లక్షలకు పెరుగుతుందని, అక్కడి నుంచి మరింత వ్యాప్తి చెందుతుందని స్పష్టం చేస్తున్నారు. 
జనవరి 23వ తేదీ నాటికి రోజుకు 25 వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతారని సంచలన అంచనాలు వెలువరించారు ఎక్స్‌పర్ట్‌లు. ఇదే నిజమైతే...చైనా వణికిపోవడం ఖాయం. ఇప్పటికే అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కరోనా బాధితులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. నిపుణులు చెప్పినట్టుగా కేసులు ఆ స్థాయిలో పెరిగితే అక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడతారో ఊహించు కోడానికి కూడా భయంగానే ఉంది. సరైన వైద్యం దొరక్క ఇప్పటికే అల్లాడిపోతున్నారు. అంత్యక్రియలు చేయడానికి కూడా వీల్లేకుండా పోతోంది. ఇందుకోసం చాలా రోజుల పాటు ఎదురు చూడాల్సి వస్తోంది. 


చైనా బుకాయింపు..


చైనా పరిస్థితి ఎలా ఉందో ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నాయి. శ్మశానాల వద్ద క్యూలైన్లు, మెడిసిన్స్ కొరత, ఆసుపత్రులు హౌస్‌ఫుల్ అంటూ చైనాలో కరోనా పరిస్థితులపై రోజూ కథనాలు వస్తాయి. ఎప్పటిలానే ఈ వార్తలను చైనా తోసిపుచ్చింది. ఇవన్నీ వక్రీకరించిన కథనాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. 


" కరోనా ప్రారంభమైన నాటి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకే మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రజలను కాపాడేందుకు అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచాం. దశలవారీగా వైరస్ విజృంభిస్తోంది. దానిని ఎదుర్కొనేందుకు 
అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సమయానుకూలంగా శాస్త్రీయ పద్ధతులను చైనా అనుసరిస్తోంది.                     "
-    చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి  


కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ జీరో కొవిడ్ విధానం నుంచి చైనా క్రమంగా దూరంగా జరుగుతోంది. విదేశాల నుంచి చైనాకు వచ్చే ప్రయాణికులకు వచ్చే నెల 8వ తేదీ నుంచి క్వారంటైన్ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. అంతేకాకుండా కొవిడ్ స్థాయిని క్లాస్ 'ఎ' ఇన్‌ఫెక్షన్ల నుంచి క్లాస్ 'బి' కి తగ్గిస్తున్నట్లు చైనా జాతీయ హెల్త్ కమిషన్  ప్రకటించింది. తద్వారా కొవిడ్ రోగులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి తప్పనిసరి క్వారంటైన్ సహా కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో లాక్ డౌన్ అవసరం లేకుండా పోయింది. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు సడలించడంతో చైనీయులు విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీని వల్ల ఇతర దేశాలకు కూడా చైనాలో ఉన్న కొత్త వేరియంట్లు ప్రబలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Also Read: Covid-19 New Variant: అమెరికాలో కొత్త వేరియంట్, అనూహ్య వేగంతో వ్యాప్తి! - ప్రముఖ వైరాలజిస్ట్ హెచ్చరికలు