TCS Salary Hike: నూతన సంవత్సరం (2023‌) కానుకగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) తన ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచుతోందని, బ్రహ్మాండమైన న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇస్తోందన్న ఒక వార్త సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. TCS ఉద్యోగులకు ఆ కంపెనీ భారీగా జీతాలు పెంచాలని నిర్ణయించుకున్నట్లు గత కొన్ని రోజులుగా అనేక పత్రికలు, ఛానెళ్లలో, ముఖ్యంగా యూట్యూబ్‌ ఛానెళ్లలో పెద్ద సంఖ్యలో కథనాలు వెలువడ్డాయి. ఆ వార్తల పట్ల కంపెనీ ఉద్యోగులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.


కంపెనీ ఉద్యోగుల జీతాన్ని 20 శాతం నుంచి 70 శాతం వరకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పెంచబోతోంది. దీంతో పాటు, కంపెనీలో పని చేస్తున్న మొత్తం అందరి (100 శాతం ఉద్యోగులు) జీతాలను పైకి సవరించబోతోంది. ఈ పెంపు కొత్త సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో జీతాల పెంపు వల్ల 4 లక్షల మందికి పైగా ఉద్యోగులు ప్రయోజనం పొందుతారన్నది గత కొన్ని రోజులుగా వెలువడుతున్న కథనాల సారాంశం.


జీతాల పెంపుపై టీసీఎస్ నిర్ణయం ఇది
తాజాగా, జీతాల పెంపు వార్తలను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఖండించింది. దీని గురించి ఆ కంపెనీ ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. "కొన్ని మీడియా పత్రికలు, ఛానెళ్లలో వచ్చిన జీతాల పెంపు వార్త పూర్తిగా తప్పు, నిరాధారం, ఇందులో ఒక్క శాతం కూడా నిజం లేదు. ప్రస్తుతానికి, కంపెనీ ఎలాంటి వేతన పెంపును ప్రకటించలేదు" అని తన ప్రకటనలో పేర్కొంది. జీతాల పెంపు వార్త వంటి అబద్ధపు ప్రచారాలను పట్టించుకోవద్దని తన వాటాదారులు & ఉద్యోగులకు టీసీఎస్‌ సూచించింది. 


2022 సంవత్సరంలో టీసీఎస్‌ ఒక ఘనత అందుకుంది. కంపెనీ త్రైమాసిక లాభం మొదటిసారిగా రూ. 10 వేల కోట్ల మార్క్‌ దాటింది. 2022 జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 10,431 కోట్ల రికార్డ్‌ స్థాయికి లాభాలను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఆర్జించింది. సంస్థ అద్భుతమైన పనితీరు నేపథ్యంలో, వేరియబుల్‌ పే (Variable Pay) రూపంలో త్వరలో దాని ఉద్యోగులకు జీతాల పెంపును బహుమతిగా ఇవ్వవచ్చని ఊహాగానాలు వెలువడ్డాయి.


వేరియబుల్ పే అంటే పని తీరు ఆధారంగా చెల్లించే వేతనం. ప్రధానంగా కంపెనీ పని తీరు మీద ఆధారపడి దీనిని శాతం రూపంలో చెల్లిస్తారు.


మాంద్యం భయాల్లోనూ కొత్త ఉద్యోగాలు
2022 సంవత్సరంలో పరిస్థితులు కలిసిరాక, భారత దేశంలో & ప్రపంచంలోని అనేక పెద్ద టెక్ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. అలాంటి పరిస్థితుల్లోనూ, TCS ఉద్యోగాలను తీసేయలేదు. అంతేకాదు, 2022 ఆగస్టు నెలలో మొత్తం 1,200 మందిని కంపెనీ నియమించింది. 2022 జులై నుంచి సెప్టెంబరు వరకు మొత్తం 9,840 మంది కొత్తవారికి ఉద్యోగాలు ఇచ్చింది. ఈ కొత్త వాళ్లను కూడా కలిపి చూస్తే.. 2022 సెప్టెంబర్ చివరి నాటికి, టీసీఎస్‌ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,61,171 కి చేరుకుంది.