ప్రపంచమంతా కొత్త ఏడాదికి స్వాగతం చెప్పేందుకు సిద్ధమైంది. 2023కి ఘన స్వాగతం పలికేందుకు ఒక్కొకరు ఒక్కోరకంగా ప్లాన్ వేసుకుంటున్నారు. పార్టీలు, విందులు, వినోదాలతో సందడి చేయాలనుకుంటున్నారు. పాపం ఆ యువకులు కూడా అలాంటి కలలే కన్నారు. కొత్త ఏడాది సంబరాలు ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారు. అంతలోనే మృత్యువు బస్సు రూపంలో దూసుకొచ్చింది. వారి బైక్ ని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మూడో వ్యక్తి మృత్యువుతో పోరాడుతున్నాడు.




న్యూ ఇయర్ ప్రారంభం రోజున బైక్ లు వేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురవుతుంటారు చాలామంది. దానికి ఒకరోజు ముందే అతి వేగం ఇద్దరు యువకుల ప్రాణం తీసింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు ఓవెల్ స్కూల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ లో ముగ్గురు వస్తుండగా ఎదురుగా వస్తున్న టౌన్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన యువకుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికులు.


ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు..


జెట్టి విష్ణువర్ధన్ అలియాస్ విష్ణు ( రామకోటయ్య నగర్ )


షేక్ ఖాసిం అలియాస్ సన్నీ (పోలీస్ కాలనీ )


ప్రమాదంలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న వ్యక్తి (వెంకటేష్)  వైఎస్ఆర్ నగర్..


మృతి చెందిన ఇద్దరు ఇంటర్ చదువు మధ్యలో ఆపివేసి ఆటో డ్రైవర్లు పని చేస్తున్నట్లు తెలిసింది.  ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు.


అతివేగమే కారణమా..?


నెల్లూరులో జరిగిన ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదం ధాటికి నుజ్జు నుజ్జుగా మారింది. అతి వేగంగా వస్తున్న బైక్ ని బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ జన సంచారం కూడా పెద్దగా లేదు. బస్సులోనివారు వెంటనే కిందపడి గాయాలపాలైన యువకులను కాపాడటానికి ప్రయత్నించారు కానీ వీలుకాలేదు. అప్పటికే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తలలు పగిలి రక్తం ధారలా పారింది. తీవ్ర రక్తస్రావంతో విష్ణు, సన్నీ అక్కడికక్కడే మృతి చెందగా వెంకటేష్ అనే వ్యక్తిని మాత్రం స్థానికులు రక్షించి ఆస్పత్రికి తరలించారు.


సరిగ్గా కొత్త ఏడాది ముందు జరిగిన ఈ రోడ్డు ప్రమాదం జిల్లాలో షాకింగ్ ఘటనగా మారింది. అప్పటి వరకూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుకున్నామని, అంతలోనే వారు అలా చనిపోతారనుకోలేదని స్నేహితులు చెబుతున్నారు. చనిపోయిన ఇద్దరు అవివాహితులు. తమ పిల్లలు రోడ్డు ప్రమాదంలో చనిపోయారనే విషయం  తెలుసుకుని తల్లిదండ్రులు పరుగు పరుగున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి రోదనలతో ఆ ప్రాంతం అంతా విషాద వాతావరణం నెలకొంది.


అతి వేగం వద్దని, బైక్ పై వెళ్లే సమయంలో హెల్మెట్ విధిగా ధరించాలని పోలీసులు చెబుతున్నా కూడా యువత పెడచెవిన పెడుతోంది. దీనికి ఇప్పుడు ఇద్దరు యువకులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అతి వేగంతోపాటు, ఎవరూ హెల్మెట్ పెట్టుకోలేదు. దీంతో కిందపడిన వెంటనే ఇద్దరికి తలలపై తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో వారు అక్కడికక్కడే చనిపోయారు.