నెల్లూరు వైసీపీలో నిన్నటి వరకు కాకాణి గోవర్దన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ మధ్య అంతర్గత పోరు నడిచింది. ఆ తర్వాత మేకపాటి ఫ్యామిలీలో లుకలుకలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి కేంద్రంగా మరోసారి జిల్లా వైసీపీలో గొడవలు మొదలయ్యాయి. ఆనం వర్సెస్ నేదురుమల్లి.. ఈ రెండు కుటుంబాల మధ్య ఇప్పుడు వివాదం మొదలైంది. తన సీటు కాజేయాలని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ పరోక్షంగా విమర్శించారు ఆనం. ముందు రోజు అసలు ప్రభుత్వం ఏం పని చేస్తోందని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మల్యే ఇలా మాట్లాడతారని ఎవరూ అనుకోలేదు. ఆ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైసీపీ సానుభూతిపరులే ఆనంపై సెటైర్లు పేల్చారు. అంత తొందరగా ఉంటే పార్టీ మారొచ్చుకదా అని సలహా ఇచ్చారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే ఆనంకి వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆనంని తూర్పారబడుతున్నారు నేతలు.


నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి రగిల్చిన చిచ్చు మెల్లగా అంటుకుంది. ఆనం వర్గం, ఆనం వ్యతిరేక వర్గంగా జిల్లా పార్టీ రెండుగా చీలిపోయింది. అయితే ఎవరూ ఇన్నాళ్లు బయటపడటంలేదు. ఆనం నేరుగా ఇప్పుడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో ఆయన వ్యతిరేక వర్గానికి ఇప్పుడు మాట్లాడే అవకాశం లభించింది. దీంతో కొందరు అప్పుడే ఆనంపై గళమెత్తారు. పార్టీలు మారే ఆనంకి ఇదేం కొత్తకాదంటున్నారు వైసీపీ మహిళా నేతలు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనే విమర్శిస్తారని తీవ్రంగా విమర్శించారు. ఇటీవల ఆయనే రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారని, అంతలోనే ఆ విషయం మరచిపోయారా అన ప్రశ్నించారు. ఆయన్ను తులసివనంలో గంజాయి మొక్క అని తేల్చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని, పార్టీని ఉపయోగించుకుని ఆయన ఎమ్మెల్యేగా గెలిచారని విమర్శించారు.


ఇక ఆనం కి సపోర్ట్ గా మరో బ్యాచ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. రాపూరు వైసీపీ నాయకులు ఆనంకి సపోర్ట్ గా మాట్లాడారు. ఎస్ఎస్ కెనాల్ పనులు ప్రారంభం కాకపోవడం వల్లే ఆనం అలా మాట్లాడారని, ఆయనపై కొందరు నోరు పారేసుకుంటున్నారని, ఆనంపై మాట్లాడే అర్హత వారికెక్కడిదని ప్రశ్నించారు. మొత్తమ్మీద ఆనం రగిల్చిన చిచ్చు ఇప్పుడు నెల్లూరులో భగ్గున మండుతోంది. ఆనంకి మద్దతుగా కొందరు, ఆనంని వ్యతిరేకిస్తూ మరికొందరు మీడియా ముందుకొస్తున్నారు. బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఆనం వచ్చే దఫా జరిగే ఎన్నికల్లో ఎక్కడికి వెళ్తారు, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే వ్యవహారం కూడా ఊహలకు అందడంలేదు. ఆయన వైసీపీలో ఉండరనే విషయం దాదాపుగా ఖరారైంది. ఉన్నా ఆయనకు టికెట్ ఇవ్వకపోవచ్చనే ఊహాగానాలు బలపడుతున్నాయి. దీంతో ఆయన కచ్చితంగా పార్టీ మారతారని, నియోజకవర్గం కూడా మార్చేస్తారని అంటున్నారు. వెంకటగిరి నియోజకవర్గం నెల్లూరు, తిరుపతి.. రెండు జిల్లాలకు వెళ్లిపోవడంతో.. ఆయన పూర్తిగా నెల్లూరు జిల్లాలోనే ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది.