Covid-19 New Variant in US:
కొత్త వేరియంట్ XBB15
చైనాలో BF.7 వేరియంట్‌తో ఇప్పటికే చైనా అల్లాడుతోంది. మృతుల సంఖ్యను ఆ దేశం దాచి పెడుతున్నప్పటికీ...అక్కడి విజువల్స్ మాత్రం అందరినీ కలవర పెడుతున్నాయి. ఒమిక్రాన్‌కు సబ్ వేరియంట్‌లు ఇలా దాడి చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ వైరాలజిస్ట్ ఎరిక్..ఈ విషయం వెల్లడించారు. కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోందని ట్విటర్ వేదికగా చెప్పారు. "కరోనా కొత్త వేరియంట్ XBB15 అమెరికాలో వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్‌తో అగ్రరాజ్యంలో మళ్లీ విధ్వంసం చూస్తాం" అని హెచ్చరించారు. గత వేరియంట్‌లతో పోల్చి చూస్తే 120% అధిక వేగంతో ఇది వ్యాప్తి చెందుతుందని అంచనా వేశారు. యూకేలో XBB15 వేరియంట్ వ్యాప్తి వారం రోజుల్లోనే 0-4.3%కి పెరిగిందని ఎరిక్ వెల్లడించారు. మరో వారం రోజుల్లో 10% కి అధికమవుతుందని అన్నారు. ఇదే తరహాలో... అమెరికాలోనూ తీవ్రంగా వ్యాప్తి చెందే ప్రమాదముందని చెప్పారు. హార్వర్డ్ యూనివర్సిటీతో ఎన్నో సంవత్సరాల పాటు పని చేసిన ఎరిక్ ఈ హెచ్చరికలు చేయడం సంచలనమవుతోంది. పలువురు నిపుణులు కూడా ఎరిక్ ట్వీట్ చేసిన పోస్ట్‌లను రీట్వీట్ చేస్తూ హెచ్చరిస్తున్నారు.
భారత్‌లో ఇలా...
కరోనా మహమ్మారి మరోసారి భారత్ లో తన విశ్వరూపాన్ని చూపించే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. జనవరి నెలలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇంతకు ముందు కేసులు పెరిగిన విధానాన్ని పరిశీలించి ఈ విషయం వెల్లడించారు. రానున్న 40 రోజులు చాలా కీలకమని ,అందరు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. "గతంలో తూర్పు ఆసియా లో వ్యాప్తి చెందిన 30-35 రోజుల తర్వాత కరోనా కొత్త వేవ్ భారత్ లోకి ప్రవేశించింది. ప్రతిసారి ఇదే కొనసాగింది" అని ఓ కేంద్ర ఆరోగ్యశాఖ అధికారి తెలిపినట్టు వార్త సంస్థ PTI పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలు చేసి భారత్ కు వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మందికి కరోనా పరీక్షలు తప్పనిసరి అని గత శనివారం కేంద్రం వెల్లడించింది.
Also Read: మనదేశంలో గత రెండేళ్లలో 5 శాతం పెరిగిన ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు, కరోనానే కారణమా?