కేంద్రప్రభుత్వం ఆరోగ్యపరమైన సమాచారాన్ని ప్రతి ఏడాది విడుదల చేస్తుంది. అలాగే ఈసారి కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన సమాచారం మేరకు మన దేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు అయిదు శాతం పెరిగాయి. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్లో ఈ రోగుల సంఖ్య అధికంగా ఉన్నట్టు తేలింది. 2022లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 2,10,958 క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.ముందు ఏడాదితో పోలిస్తే దాదాపు 34,000 కంటే ఎక్కువ కేసులు పెరిగాయని ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది.ఊపిరితిత్తుల కేసులు అధికంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో నమోదయ్యాయని ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో ఉంది. ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే, తమిళనాడులో ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులు అధికంగా ఉండగా, తరవాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళలో ఉన్నాయి. అయితే కరోనా వచ్చాకే ఊపిరితిత్తుల క్యాన్సర్ పెరిగిందని వాదించే వాళ్లు ఉన్నారు. దాని బారిన తీవ్రంగా పడిన వారిలో ఇది వచ్చే అవకాశం లేకపోలేదని కూడా చెబుతున్నారు. కరోనా తీవ్రంగా వచ్చినప్పుడు ఊపిరితిత్తుల్లోని కణాలు దెబ్బతినవచ్చు, దెబ్బతిన్న ఆ కణాలు కుళ్లి క్యాన్సర్ కణాలు మారవచ్చు. 


ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే?
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం, ఊపిరితిత్తులలోని కణాలు దెబ్బతిన్న తర్వాత కొన్నిసార్లు మ్యుటేషన్‌కు లోనవుతాయి. అవి నియంత్రణ లేకుండా ఒకేచోట పెరుగుతూ కణితుల్లా మారతాయి. చివరికి సరిగ్గా పనిచేయకుండా చేస్తాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ సాధారణంగా బ్రోన్కియోల్స్ అని పిలిచే చిన్న గాలి సంచులుండే ప్రాంతంలో ప్రారంభమవుతుంది.


లక్షణాలు ఏమిటి?
ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభ దశలలో కనిపించే ప్రధాన లక్షణాలు కొన్ని ఉన్నాయి. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. 
1. దీర్ఘకాలిక దగ్గు
2. దగ్గినప్పుడు రక్తం కనిపించడం
3. శ్వాస సరిగా ఆడకపోవడం
4. ఛాతి నొప్పి
5. గొంతులో బొంగురుతనం
6. బరువు తగ్గడం
7. ఎముక నొప్పి
8. తలనొప్పి ఎక్కువగా రావడం


కారణమేమిటి?
మాయో క్లినిక్ ప్రకారం, ధూమపానం అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణం. ధూమపానం చేసేవారిలో, పక్కన నిల్చుని ఆ పొగను పీల్చేవారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అయితే ధూమపానం చేయని వారిలో కూడా ఇప్పుడు ఈ క్యాన్సర్ కనిపించడం భయాందోళనకు గురిచేస్తోంది. 


ఇలా కూడా రావచ్చు...
రేడియేషన్ థెరపీ: మీరు వేరే రకమైన క్యాన్సర్ కోసం గతంలో ఛాతీకి రేడియేషన్ థెరపీ చేయించుకున్నట్లయితే, మీకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 
రాడాన్ వాయువు: పీల్చే గాలిలో భాగమైన నేల, రాతి , నీటిలో యురేనియం సహజ విచ్ఛిన్నం ద్వారా రాడాన్ ఉత్పత్తి అవుతుంది. రాడాన్ కణాలు ఇళ్లతో సహా ఏదైనా భవనంలో పేరుకుపోతాయి. వాటిని పీల్చినప్పుడు కూడా ఈ క్యాన్సర్ రావచ్చు. 


ఆస్బెస్టాస్ ఎక్స్పోజర్: ఆస్బెస్టాస్, ఆర్సెనిక్, క్రోమియం, నికెల్ వంటి క్యాన్సర్‌కు కారణమయ్యే ఇతర పదార్థాలు ఊపిరితిత్తులను చేరినప్పుడు కూడా ఈ ప్రమాదం పెరుగుతుంది. 


కుటుంబ చరిత్ర: ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లిదండ్రులు, తోబుట్టువులు ఉన్నప్పుడు వారసత్వంగా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. 


Also read: కొత్త ఏడాదిలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ఈ పనులు చేస్తామని ప్రమాణం చేయండి



























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.