కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. దేవాలయాలు, చర్చిల్లో ప్రత్యేక దర్శనాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ, వైజాగ్ లాంటి నగరాల్లో పార్టీల కోసం వివిధ సంస్థలు ఏర్పాట్లు చేసుకున్నాయి.
కొత్త ఏడాది వేడుకల సందర్భంగా విజయవాడలో పోలీసుల ఆంక్షలు||
అర్ధరాత్రి బహిరంగ వేడుకలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. విజయవాడలో సెక్షన్ 30, సెక్షన్ 144 అమలులో ఉంది. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి సమయంలో ఆంక్షలు తప్పనిసరి చేసింది ప్రభుత్వం. బందర్ రోడ్, ఏలూరు రోడ్, BRTS రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. బెంజ్ సర్కిల్, కనకదుర్గ, పీసీఆర్ పైవంతెనలపైకి వాహనాలకు అనుమతించడం లేదు. క్లబ్బులు, రెస్టారెంట్లలో వేడుకలకు పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ శబ్దాలు వచ్చే సౌండ్ సిస్టం వాడకూడదన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్లపై గుంపులుగా వచ్చి కేకులు కట్ చేసి అల్లరి చేస్తే కఠిన చర్యల తప్పవని వార్నింగ్ ఇచ్చారు. బైక్‍లకు సైలెన్సర్ తీసేసి అధిక శబ్దాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
విజయవాడలో సీఐ కానిస్టేబుల్ సస్పెన్షన్||
విజయవాడ ఐదవ టౌన్ ట్రాఫిక్ స్టేషన్ సీఐ రవికుమార్, కానిస్టేబుల్ రాంబాబును సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ క్రాంతి రతన్ టాటా ఉత్తర్వులు జారీ చేశారు.సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్ర చూడ్ విజయవాడ పర్యటనలో ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా లేకపోవడం డిజిపి పరిశీలించి, సిపికి సమాచారం ఇవ్వడంతో.. విధి నిర్వహణ లో నిర్లక్ష్యంగా ఉన్నందుకు సస్పెండ్ చేశారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.. శనివారం శ్రీనివాసుడికి ప్రీతికరమైన రోజు కావడంతో సుప్రభాతం సేవ అనంతరం నువ్వుల గింజలతో ప్రసాదంను నివేదిస్తారు అర్చకులు.. శుక్రవారం రోజున 63,253 మంది స్వామి వారి దర్శించుకున్నారు.. ఇక స్వామి వారికి 24,490 మంది తలనీలాలు సమర్పించగా, 5.16 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.. అయితే సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 24 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు.. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు దాదాపు 18 గంటలకు పైగా సమయం పడుతుంది.. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు రెండు గంటల సమయం పడుతుంది..
సంక్రాంతికి మరో 16 ప్రత్యేక రైళ్లు.
సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అధికంగా రద్దీ ఉండే రోజుల్లో ప్రత్యేక రైళ్లు బయలుదేరేలా ఏర్పాట్లు చేశారు. జనవరి 7 నుంచి 18 వరకు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడవనున్నాయి. హైదరాబాద్ నుంచి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. రైళ్ల పూర్తి వివరాలు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. రేపు ఉదయం 8గంటల నుంచి ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.