Delhi Air Pollution:


పడిపోయిన ఎయిర్ క్వాలిటీ..


ఢిల్లీ కాలుష్య సమస్య రోజురోజుకీ సంక్లిష్టమవుతోంది. ఎయిర్ క్వాలిటీ పడిపోతూ వస్తోంది. మరోసారి అక్కడి గాలి నాణ్యత "అత్యంత ప్రమాదకర స్థాయికి" చేరుకుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం...ఢిల్లీలో AQI 339గా నమోదైంది. అటు ఎన్‌సీఆర్ ప్రాంతంలోనూ దాదాపు ఇదే స్థాయిలో వాయునాణ్యత పడిపోయింది. నోయిడాలో 337, గురుగ్రామ్‌లో 338గావెల్లడైంది. System of Air Quality and Weather Forecasting And Research (SAFAR) ప్రకారం..వచ్చే మూడు రోజుల పాట ఢిల్లీలో ఇవే పరిస్థితులు కొనసాగనున్నాయి. 
రెండ్రోజుల క్రితం ఢిల్లీలో AQI 326గా నమోదైంది. పరిస్థితులు మరీ దిగజారుతున్నందున కేంద్రానికి చెందిన ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ అప్రమత్తమైంది. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో గాలి నాణ్యతను పెంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. నిర్మాణాలు, కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతాల్లో యాంటీ స్మాగ్ గన్స్ వినియోగించాలని సూచించింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కూడా కొన్ని చర్యల్ని సూచించింది. విండ్ బ్రోకర్స్‌తో పాటు దుమ్ముని అరికట్టే తెరలు, నిర్మాణ సామగ్రిని, శిథిలాలను సరై విధంగా కప్పి ఉంచటం, సరైన విధంగా శిథిలాలను డిస్పోస్ చేయడం, అత్యంత జాగ్రత్తగా వాటిని రవాణా చేయటం లాంటి జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. 5 వేల నుంచి 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జరుగుతున్న నిర్మాణాల వద్ద కచ్చితంగా ఓ యాంటీస్మాగ్ గన్ ఏర్పాటు చేయాలని వెల్లడించింది. 


కీలక నిర్ణయాలు..


ఢిల్లీలో ప్రైమరీ స్కూల్స్‌ను మూసివేశారు. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో...ఈ నిర్ణయం తీసుకుంది ఆప్ సర్కార్. పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ మరో కీలక ప్రకటన కూడా చేశారు. దాదాపు 50% ప్రభుత్వ ఉద్యోగులు ఇంటినుంచే పని చేస్తారని స్పష్టం చేశారు. ప్రైవేట్ స్కూల్స్ కూడా విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహించే ఆలోచన చేయాలని సూచించారు. బీఎస్-6 వాహనాలకు తప్ప మిగతా వెహికిల్స్ రోడ్‌పైన తిరిగేందుకు అనుమతి లేదని వెల్లడించారు. కేవలం డీజిల్‌తో నడిచే లైట్ మోటార్ వెహికిల్స్‌కు పర్మిషన్ ఉంటుంది చెప్పారు. "పర్యావరణ్ బస్ సర్వీస్‌"లో భాగంగా 500 ప్రైవేట్ సీఎన్‌జీ బస్‌లను నడుపుతున్నట్టు తెలిపారు. ప్రజలు సొంత వాహనాలు పక్కన పెట్టి ఈ ప్రజా రవాణాను వినియోగించాలని సూచించారు. మార్కెట్‌లు, ఆఫీస్‌లు ఎప్పటి వరకూ తెరిచి ఉండాలన్నది రెవెన్యూ కమిషనర్లు నిర్ణయిస్తారని అన్నారు. ఢిల్లీలోని హాట్‌స్పాట్‌ల వద్ద స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌లను నియమించి కాలుష్య కట్టడికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రమాదకరమైన PM 2.5 కాలుష్యానికి...పంజాబ్‌లో రైతులు గడ్డి కాల్చటమే కారణమని అధికారులు తెలిపారు. ఈ కారణంగానే...దేశ రాజధానిలో 34% మేర కాలుష్యం నమోదవుతోందని పేర్కొన్నారు. పంజాబ్ రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు గోపాల్ రాయ్. లక్షా 20 వేల మెషీన్లతో గడ్డిని పంట పొలాల్లో నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. 


Also Read: Viral Video: కింగ్ ఫిష్ కోసం వెళ్తే కిల్లర్ షార్క్ దొరికింది- వైరల్ వీడియో!