Dailyhunt - AMG Media: డైలీహంట్, అదానీకి చెందిన ఏఎమ్‌జీ మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్ కలిసి 'స్టోరీ ఫర్ గ్లోరీ' పేరుతో నిర్వహించిన టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ ముగిసింది. దిల్లీలో బుధవారం గ్రాంఢ్ ఫినాలే నిర్వహించింది.
టాలెంటెండ్ కంటెంట్ క్రియేటర్స్‌తో పాటు భావి కథకులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో డైలీ హంట్, అదానీ మీడియా ఇనిషియేటివ్స్‌తో కలిసి 'స్టోరీ ఫర్ గ్లోరీ' పేరుతో ఈ టాలెంట్ హంట్ నిర్వహించింది.
ఈ పోటీలో వీడియో, ప్రింట్ అనే రెండు కేటగిరీల కింద మొత్తం 12 మంది విజేతలుగా నిలిచారు. మే నెలలో ప్రారంభమైన ఈ పోటీల కోసం 1000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 20 మంది ప్రతిభావంతులను షార్ట్ లిస్ట్ చేశారు.
షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు అహ్మదాబాద్‌లోని ముద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్‌లో రెండు వారాల కోర్సుతో పాటు మీడియా పబ్లిషింగ్ సంస్థలతో ఆరు వారాల మెంటార్‌షిప్ నిర్వహించారు. తర్వాత రెండో ఫేజ్‌లో ఆయా కథకుల నైపుణ్యాన్ని పరీక్షించారు. ఇందులో నుంచి టాప్ 12 స్టోరీ టెల్లర్స్‌ను జ్యూరీ ఎంపిక చేసింది. అనంతరం వీరికి నగదు బహుమతులను అందజేశారు. దీంతో పాటు వీరికి ప్లేస్‌మెంట్ అవకాశాలు అందిస్తామన్నారు.
జ్యూరీ సభ్యులు
- వీరేంద్ర గుప్తా (డైలీహంట్ వ్యవస్థాపకుడు)
- సంజయ్ పుగాలియా ( AMG మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్ CEO, ఎడిటర్-ఇన్-చీఫ్)
- అనంత్ గోయెంకా ( ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)
- అనుపమ చోప్రా ( ఫిల్మ్ కంపానియన్ ఫౌండర్)
- శైలీ చోప్రా (SheThePeople స్థాపకుడు)
- నీలేష్ మిశ్రా (గావ్ కనెక్షన్ వ్యవస్థాపకుడు)
- పంకజ్ మిశ్రా (ఫ్యాక్టర్ డైలీ సహ వ్యవస్థాపకుడు)
#StoryForGlory కార్యక్రమం ద్వారా ఎంతోమంది యువత నుంచి కొత్తదనాన్ని, సృజనాత్మకతను వెలికి తీసినట్లు జ్యూరీ సభ్యులు తెలిపారు. ఇందులో గెలిచిన వారికి జర్నలిజం రంగంలో అడుగుపెట్టడానికి అవసరమైన ఒక వేదికను కల్పించినట్లు వెల్లడించారు.
ఇదే లక్ష్యం
శ్రోతలను కట్టిపడేసి, వారిని ఊహా ప్రపంచంలో విహరింపజేసేలా కథలు చెప్పే కథకుల కోసం స్టోరీ ఫర్ గ్లోరీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఓ టాలెంట్ హంట్ నిర్వహించింది. కథకులకు తమ సృజనాత్మకత, కథా నైపుణ్యాన్ని ప్రదర్శించే వేదికను కల్పించడంతో పాటు నగదు బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని అందించింది.
హిందీ, ఇంగ్లీష్ మాట్లాడగలిగే వారు తమకు నచ్చిన థీమ్‌తో లేదా సాధారణ వార్తలు, కరెంట్ అఫైర్స్, బిజినెస్ అండ్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, లైఫ్ స్టైల్ లేదా కళలు, సంస్కృతి వంటి థీమ్‌లపై రెండు నిమిషాల వీడియో లేదా 500 పదాల సుదీర్ఘ కథనాన్ని సమర్పించాలని కోరింది.