Ramana Dikshitulu :   టీటీడీ అర్చకులంతా వన్ మ్యాన్ కమిటీ రిపోర్టును అమలు చేస్తామనే సీఎం జగన్ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురు చూశారని కానీ నిరాశే ఎదురయిందని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం జగన్ తిరుమల పర్యటన ముగించి కర్నూలుకు వెళ్లిన తర్వాత రమణదీక్షితులు తన అసంతృప్తిని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం టీటీడీలో ఉన్న బ్రాహ్మణ వ్యతిరేక శక్తుల వల్ల అర్చక వ్యవస్థ, ఆలయ ప్రతిష్ట కోసం మకుందుగా వన్ మ్యాన్ కమిటీని అమలు చేసేలా ప్రకటన చేయాల్సి ఉందన్నారు. 

Continues below advertisement



అసలేమిటి వన్ మ్యాన్ కమిటీ ?


తిరుమల తిరుపతి దేవస్థానంలో  వంశపారంపర్యంగా వచ్చే అర్చకుల శాశ్వత నియామకంపై ఏక సభ్య కమిటీని గత ఏడాది జూలైలో ప్రభుత్వం నియమించింది. వారసత్వ అర్చకుల వ్యవస్థ బలోపేతం, క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ టీటీడీలో వారసత్వ అర్చక విధానాన్ని మరింత బలంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించనుంది.   హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి. శివ శంకర్‌రావుని కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అధ్యయనం చేసి 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఏక సభ్య కమిటీని కోరింది ఏపీ ప్రభుత్వం. కే టీటీడీ అర్చకులు, భక్తుల నుంచి వచ్చిన వేర్వేరు విజ్ఞప్తుల మేరకు ఏక సభ్య కమిటీ నియమించినట్టు తెలిపింది. ఆ కమిటీ రిపోర్టు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ విషయంపైనే రమణదీక్షితులు అసంతృప్తికి గురయ్యారు. 


మళ్లీ ఆలయంలో ప్రధానార్చకులు అయ్యేందుకు రమణదీక్షితులు ప్రయత్నం ! 


తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శ్రీవారి ఆలయ ప్రధానార్చకులుగా ఉన్న రమణదీక్షితులు పింక్ డైమండ్ ఆరోపణలు చేయడంతో.. ప్రభుత్వం ఆయనకు బలవంతంగా రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ అంశంపై ఆయన న్యాయపోరాటం చేశారు. అప్పట్లో ప్రతిపక్ష నేత జగన్‌నూ కలిశారు. తమ ప్రభుత్వం వస్తే మళ్లీ ప్రధాన అర్చకులుగా నియమిస్తామనే భరోసా పొందారు. జగన్ సీఎం అయిన తర్వాత  తిరిగి ప్రధాన అర్చక హోదా పదవి పొందాలని రమణదీక్షితులు ప్రయత్నిస్తున్నారు. అయితే చట్టపరమైన అడ్డంకులు ఉండటంతో సాధ్యం కాలేదు. చివరకు వన్ మ్యాన్ కమిటీ సిఫార్సుల ద్వారా మళ్లీ ప్రధాన అర్చకులుగా రావాలనుకుంటున్నారు. టీడీలో వారసత్వ అర్చక విధానాన్ని మరింత బలంగా అమలు చేసేందుకు సిఫార్సులు చేయాలని వన్ మ్యాన్ కమిటీకి ప్రభుత్వం చెప్పడంతో ఆ కమిటీ రిపోర్టుతో మళ్లీ పాత  బాద్యతలు వస్తాయని రమణదీక్షితులు ఆశిస్తున్నారు. 


రిపోర్టుపై ఏ నిర్ణయం తీసుకోని ప్రభుత్వం !


అయితే రమణదీక్షితులకు టీటీడీతో పాటు చాలా మంది వంశపారంపర్య అర్చకులతో సత్సంబంధాలు లేవు.  పైగా మిరాశీ వ్యవస్థను గౌరవిస్తూ నాలుగు కుటుంబాలకు చెందిన యువ అర్చకులకు కూడా స్వామి వారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించారు.   వంశపారంపర్య అర్చక వ్యవస్ధ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం కమిటీ నియమించడం వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదని  మిరాశీ అర్చకులు ఎక్కువ మంది భావిస్తున్నారు. టీటీడీ బోర్డు కూడా అదే అభిప్రాయంతో ఉంది. ఈ కారణంగానే ప్రభుత్వం కమిటీ రిపోర్టు విషయంపై పట్టించుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇది రమణదీక్షితులను అసంతృప్తికి గురి చేసింది.