Cyrus Mistry death: 


కార్ నడిపింది ఆమే..


టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ (Cyrus Mistry) హఠాన్మరణం అందరినీ షాక్‌కు గురి చేసింది. ప్రధాని మోదీ సహా ప్రముఖులంతా ఆయన మృతికి సంతాపం తెలిపారు. అయితే..ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మిస్త్రీ ప్రయాణించిన కారుని ముంబైకి చెందిన గైనకాలజిస్ట్ అనహిత పండోలే నడిపినట్టు తేలింది. అహ్మదాబాద్ నుంచి ముంబయికి వస్తుండగా...మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో కార్ నడిపిన అనహిత పండోలేతో పాటు ఆమె భర్త డారియస్ పండోలే సురక్షితంగా బయటపడ్డారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే...సైరస్ మిస్త్రీ, జహంగీర్‌లు వెనక సీట్‌లో కూర్చున్నారు. ముందు సీట్‌లో అనహిత పండోలే, డారియస్ పండోలే ఉన్నారు. ప్రమాదంలో వెనక కూర్చున్న మిస్త్రీ, జహంగీర్‌లు ప్రాణాలు కోల్పోగా..ముందు సీట్‌లో కూర్చున్న వాళ్లు మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇందుకు కారణమేంటని పోలీసులు విచారించగా...ఓ కీలక విషయం తెలిసింది. ప్రమాద సమయంలో మిస్త్రీ సీటు బెల్టు పెట్టుకోలేదని తేలింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే...ఈ కారు 9 నిముషాల్లోనే దాదాపు 20 కిలోమీటర్ల ప్రయాణం చేసింది. అంటే...కారు ఎంత వేగంగా దూసుకు పోయిందో అర్థం చేసుకోవచ్చు. సూర్య నది వద్ద రాంగ్‌ సైడ్‌లో మరో వాహనాన్ని ఓవర్‌ టేక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ విచారం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. 


సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం వల్లే..


మిస్త్రీ ప్రయాణించిన కారు Mercedes GLC.హై ఎండ్ మోడల్ అయినప్పటికీ...Air Bags ఎందుకు ఓపెన్ కాలేదు..? మిస్త్రీ ఎందుకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది..? అనే అనుమానాలు రావడం సహజం. కానీ...ఇక్కడే ఓ ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. వెనక సీట్‌లో ఉన్న మిస్త్రీ, జహంగీర్‌ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. సీట్‌ బెల్ట్ (Seat Belt) ధరించకపోతే...ఎయిర్ బ్యాగ్స్ ఉండి కూడా ఉపయోగం లేదని అంటున్నారు ఎక్స్‌పర్ట్‌లు. ఎందుకంటే...మనల్ని మనం రక్షించుకోడానికి సీట్ బల్ట్‌ పెట్టుకోవడం అనేది ఫస్ట్ డిఫెన్స్ అయితే...సెకండ్ డిఫెన్స్ ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవటం. మనం సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే...ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. సీట్ బెల్ట్ పెట్టుకుని పొరపాటున సరిగా లాక్‌ చేయకపోయినా...ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం...ప్రతి కార్‌లో ఫ్రంట్‌లోనే కాకుండా వెనక భాగంలోనూ సీట్‌బెల్ట్‌లు ఉంటాయి. వెనక కూర్చునే వాళ్లూ తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. కానీ ఇలా నిబంధన ప్రకారం నడుచుకునే వాళ్లు తక్కువ. సీట్‌ బెల్ట్ పెట్టుకుంటే కంఫర్ట్ ఉండదని లైట్ తీసుకుంటారు. అదే ప్రాణాల మీదకు తెస్తోంది. కారు వేగంగా ఢీ కొట్టినప్పుడు వెనక ఉన్న వ్యక్తి ముందు సీట్‌లో కూర్చున్న వ్యక్తిని చాలా ఫోర్స్‌గా వచ్చి ఢీకొడతాడు. ఆ సమయంలో వెనక ఉన్న వ్యక్తి బరువు దాదాపు 40 రెట్లు ఎక్కువగా ఉంటుందట. 
ఉదాహరణకు ఆ వ్యక్తి బరువు 80 కిలోలు అనుకుంటే...ప్రమాద సమయంలో ఆ బరువు దాదాపు 3,200 కిలోలుగా మారిపోయి..ముందున్న వ్యక్తిపై పడుతుంది. అంత బరువు మీద పడితే..ముందున్న వ్యక్తి ఒకవేళ సీట్‌ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ...కచ్చితంగా బతుకుతాడన్నగ్యారెంటీ లేదు. అదృష్టం బాగుంటే తీవ్ర గాయాలతో బయటపడొచ్చు. అయితే..వెనక ఉన్న వ్యక్తి మాత్రం సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం వల్ల ముందున్న వ్యక్తిని బలంగా ఢీకొని ప్రాణాలు కోల్పోతాడు. ఇప్పుడు మిస్త్రీ విషయంలో ఇదే జరిగింది.