Cough Syrup Case:


18 మంది చిన్నారులు మృతి...


భారత్‌కు చెందిన ఫార్మా కంపెనీ తయారు చేసిన దగ్గు మందు వల్ల ఉజ్బెకిస్థాన్‌లో 18 మంది చిన్నారులు మృతి చెందారన్న ఆరోపణలు సంచలనం సృష్టించాయి. వెంటనే అప్రమత్తమైన కేంద్రం ఆ కంపెనీపై ప్రత్యేక నిఘా పెట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నోయిడాలోని Marion Biotech Pvt Ltd కంపెనీకి చెందిన ముగ్గురు అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇండియాస్ సెంట్రల్ డ్రగ్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఫిర్యాదు మేరకు పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ FIRలో మొత్తం ఐదుగురి పేర్లున్నాయి. వీరిలో ముగ్గురు అధికారులు కాగా...మరో ఇద్దరు డైరెక్టర్లు. ఇప్పటికే యూపీ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDSA) విభాగం ఆ కంపెనీ మ్యానుఫాక్చరింగ్ లైసెన్స్‌ను రద్దు చేసింది. డ్రగ్ రికార్డ్‌లు సరిగా మెయింటేన్ చేయకపోవడంతో పాటు మందు తయారీకి ఏయే పదార్థాలు వినియోగిస్తున్నారన్న వివరాలు సరైన విధంగా అందించలేదు. అందుకే లైసెన్స్ రద్దు చేశారు అధికారులు. ఘజియాబాద్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఈ మేరకు కీలక విషయాలు వెల్లడించారు. ఫేజ్‌ -3 లోని Marion Biotech Pvt Ltd కంపెనీ ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని...సంస్థ డైరెక్టర్లు జయ జైన్, సచిన్ జైన్, ఆపరేషన్ హెడ్ తుహిన్ భట్టాచార్యపైనా కేసులు నమోదు చేశామని తెలిపారు. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టంలోని 17,17A,17-B సెక్షన్ల కింద FIR నమోదు చేసినట్టు వివరించారు. ప్రస్తుతానికి పోలీసులు తుహిన్ భట్టాచార్య, అతుల్ రావత్, మూల్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కంపెనీ యజమాని కోసం గాలిస్తున్నారు. త్వరలోనే అతడినీ అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. 


కంపెనీ కార్యకలాపాలు బంద్..


కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ్ గతేడాది డిసెంబర్‌లో  కీలక ప్రకటన చేశారు. ఈ మరణాలకు కారణమైన నోయిడాలోని మేరియన్ బయోటెక్ కంపెనీ కార్యకలాపాలను నిలిపివేసినట్టు ప్రకటించారు. Central Drugs Standard Control Organisation (CDSCO) తనిఖీలు చేపట్టిన తరవాత తయారీ కార్యకలాపాలన్నీ ఆపివేయించారు. విచారణ ఇంకా కొనసాగుతున్నట్టు కేంద్రమంత్రి స్పష్టం చేశారు. CDSCO అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కేసు విచారణను సమీక్షిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. యూపీ డ్రగ్ కంట్రోల్ అధికారులతో పాటు సీడీఎస్‌సీవో బృందం కూడా తయారీ యూనిట్‌లో తనిఖీలు నిర్వహించింది. ఆ సిరప్‌కు సంబంధించిన శాంపిల్స్‌ను సేకరించారు. చంఢీగఢ్‌లోని రీజియనల్ డ్రగ్స్ టెస్టింగ్ లేబొరేటరీకి పంపారు. దాదాపు 10 గంటల పాటు ఈ తయారీ యూనిట్‌లో తనిఖీలు చేపట్టారు అధికారులు. ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య శాఖ ఇప్పటికే ఈ ఘటనపై చాలా సీరియస్‌గా ఉంది. ఆ దగ్గు మందు తాగడం వల్ల 18 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని మండి పడుతోంది. ఇటీవలే గాంబియాలోనూ ఇదే తరహా మరణాలు సంభవించాయి. ఆ ప్రభుత్వం కూడా ఇండియన్ కంపెనీ తయారు చేసిన దగ్గు మందుపైనే ఆరోపణలు చేసింది. దీనిపై విచారణ కొనసాగు తుండగానే... ఉజ్బెకిస్థాన్‌లోనూ కలవరం మొదలైంది. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం విచారణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. విచారణలో ప్రాథమికంగా తేలిన విషయం ఏంటంటే...ఏ సిరప్ అయితే తాగి చిన్నారులు మరణించారో...ఆ సిరప్‌ను భారత్‌ మార్కెట్‌లు విక్రయించడం లేదు. ఇక్కడ వినియోగించేందుకు పనికి రాని సిరప్‌లను విదేశాలకు తరలించి అక్కడ విక్రయిస్తున్నారు. 


Also Read: Liquor Policy Case: ఢిల్లీ కోర్టుని ఆశ్రయించిన సిసోడియా, బెయిల్ కోసం పిటిషన్