Coronavirus Death:
రెండేళ్ల క్రితం మృతి
కరోనా ఇక పూర్తిగా పోయింది అనుకున్న ప్రతిసారీ "నేనున్నా" అని గుర్తు చేస్తోంది ఆ వైరస్. కొద్ది రోజుల క్రితం వరకూ కేసులు పెద్దగా లేవు. కానీ 15 రోజులుగా మళ్లీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. పలు చోట్ల ఆంక్షలు విధిస్తున్నారు. మాస్క్‌లు ధరించాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. సెకండ్ వేవ్‌లో ఈ వైరస్ సోకిన వాళ్లు పిట్టల్లా రాలిపోయారు. అప్పటి రోజుల్ని తలుచుకుంటే ఇప్పటికీ భయపడిపోతాం. ఈ క్రమంలోనే ఓ ఆశ్చర్యకర సంఘటన వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం ఓ వ్యక్తికి కరోనా సోకిందని కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే పరిస్థితులు చేయి దాటిపోయాయి. వైద్యులు కూడా చేతులెత్తేశారు. చనిపోయాడని వైద్యులు డిక్లేర్ కూడా చేశారు. కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. కొన్ని రోజులు బాధపడ్డారు. ఆ తరవాత సాధారణ జీవితాలు గడుపుతూ వస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వాళ్లకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఉదయం ఆరు గంటలకు ఎవరో తలుపు కొట్టిన చప్పుడైంది. ఇంత పొద్దున్నే ఎవరొచ్చి ఉంటారు అనుకుంటూ ఇంట్లో వాళ్లు తలుపు తీశారు. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి అలాగే స్టన్ అయిపోయారు. రెండేళ్ల క్రితం కరోనా చనిపోయాడనుకున్న ఆ వ్యక్తే ఇప్పుడు ఎదురుగా వచ్చి నిలబడితే నోట మాట వస్తుందా..? అవును. చనిపోయాడనుకున్న వ్యక్తి రెండేళ్ల తరవాత ఇంటికి రావడాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ కుటుంబ సభ్యులు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో జరిగిందీ వింత ఘటన.
ఇలా ఎలా జరిగింది..?
సెకండ్ వేవ్ సమయంలో కమలేష్ పాటిదార్‌కు కరోనా సోకింది. ఆసుపత్రిలో చేర్చినా ప్రాణాలు దక్కలేదు. కానీ రెండేళ్ల తరవాత ఇలా కనిపించే సరికి ఇంట్లో వాళ్లకు ఏమీ అర్థం కాలేదు. "రెండేళ్ల తరవాత ఆయన ఇంటికి వచ్చాడు. కానీ ఇన్నాళ్లు ఆయన ఎక్కడున్నది మాత్రం చెప్పలేదు" అని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. గుజరాత్‌లోని వడోదర ఆసుపత్రి సిబ్బంది ఆ వ్యక్తి చనిపోయాడని నిర్ధరించి మరీ డెడ్‌బాడీని అప్పగించారు. అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఇప్పుడెలా బతికి వచ్చాడన్నది అంతుపట్టడం లేదు. అప్పుడు వైద్యులు చనిపోయాడనుకుని పొరపడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఈ ఘటన మాత్రం అందరినీ షాక్‌కి గురి చేసింది.
కేసులు పెరుగుతాయ్..
మరో 10 నుంచి 12 రోజులపాటు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచించారు. మరో రెండు వారాల తరువాత దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చాలా మేరకు తగ్గుతుందని వైద్య నిపుణులు వెల్లడించడం ఊరట కలిగిస్తోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 వేరియంట్ ప్రస్తుతం కరోనా వ్యాప్తికి కారణం అన్నారు. కరోనా వ్యాప్తి వేగంగా జరిగి, కేసులు భారీగా నమోదవుతున్నా ఆందోళన అవసరం లేదన్నారు. ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు చాలా తక్కువ మోతాదులో ఉన్నాయని పేర్కొన్నారు.