Coronavirus Cases India:


ఆ రాష్ట్రంలోనే ఎక్కువ కేసులు..


భారత్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇటీవలే ఆర్నెల్ల రికార్డుని అధిగమించి కేసులు నమోదు కాగా...ఇప్పుడా రికార్డునీ దాటేశాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4,435 కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 23,091 కు పెరిగింది. అంతకు ముందు రోజు 3,038 కేసులు నమోదు కాగా...ఒక్క రోజులోనే దాదాపు వెయ్యికి పైగా కేసులు పెరిగాయి. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా మృతుల సంఖ్య 5 లక్షల 30 వేల 916కి చేరుకుంది. మహారాష్ట్రలో నలుగురు మృతి చెందారు. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, పుదుచ్చేరి, రాజస్థాన్‌లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఈ కొత్త కేసులతో మొత్తం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 47 లక్షలకు చేరుకుంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.05%గా ఉంది. రికవరీ రేటు 98.76%గా నమోదైంది. డెయిలీ పాజిటివిటీ రేటు 3.38%, వీక్‌లీ పాజిటివిటీ రేటు 2.79%గా ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం...దేశవ్యాప్తంగా 222 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్‌ డోసులు అందించారు. మహారాష్ట్రలో 186% మేర కొవిడ్ కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 711 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనిపై మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి తనాజీ సావంత్ స్పందించారు. కరోనా కేసుల పెరుగుదలను గమనిస్తున్నామని వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఏప్రిల్ 13-14న మాక్ డ్రిల్‌ నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. ఢిల్లీలో కొత్తగా 521 కేసులు నమోదయ్యాయి. గతేడాది ఆగస్టు 27 తరవాత ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం మళ్లీ ఇప్పుడే. 


కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు 5 సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఇవే సూత్రాలు అమలు చేయాలని స్పష్టం చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్‌తో పాటు కొవిడ్ నిబంధనలు పాటించాలని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి మాక్ డ్రిల్‌ కూడా చేస్తామని కేంద్రం వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇది అమలవుతుందని తెలిపింది. వీటితోపాటు కొవిడ్‌, ఇన్‌ఫ్లుయెంజా మందులు అందుబాటులో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని ఆదేశించింది కేంద్రం. అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇవి తప్పకుండా అందుబాటులో ఉండాలని చెప్పింది. ఒకవేళ ఉన్నట్టుండి బాధితుల సంఖ్య పెరిగితే..అందుకు తగ్గట్టుగా పడకలు ఉన్నాయో లేదో ముందే జాగ్రత్త పడాలని తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 220 కోట్లకుపైగా వ్యాక్సిన్‌లు అందించినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఢిల్లీలోనూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ అప్రమత్తమైంది. టెస్ట్‌ల సంఖ్య పెంచాలని ఆదేశించింది. వేరియంట్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మళ్లీ కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది. 


"ప్రస్తుతానికి హాస్పిటలైజేషన్ పెరుగుతున్నట్టు ఎక్కడా ఆధారాలు లేవు. ఏదేమైనా ప్రికాషనరీ డోస్‌లు తీసుకోవాలి. వీటి సంఖ్య పెంచాలి. టెస్టింగ్‌ల సంఖ్య కూడా పెంచాలి. ఎప్పటికప్పుడు వైరస్ వ్యాప్తిపై నిఘా పెట్టాలి"


- కేంద్ర ఆరోగ్య శాఖ 


Also Read: Asia's Richest Person: ముకేష్‌ అంబానీ మళ్లీ నం.1 - వెనుకడుగేసిన గౌతమ్‌ అదానీ