అమెరికా మాజీ అధ్యక్షుడు, 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. అమెరికా చరిత్రలోనే మాజీ అధ్యక్షుడు అరెస్ట్ కావడం ఇదే తొలిసారి. 2016 నాటి హుష్ మనీ కేసులో ఆయనపై మనహటన్ కోర్టులో 34 అభియోగాలు నమోదవ్వగా.. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11.45 గంటలు) ఆయన లొంగిపోయారు. కోర్టు హాలుకు చేరుకోగానే పోలీసులు ట్రంప్‌ను అరెస్టు చేశారు. అనంతరం కోర్టు సిబ్బంది ఆయన ఫొటోలు, వేలి ముద్రలు సేకరించారు. ట్రంప్‌ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నట్టు కోర్టు పరిగణించింది.
విచారణ సందర్భంగా ట్రంప్‌పై దాఖలైన 34 అభియోగాలను న్యాయమూర్తి జువాన్ మాన్యుయల్ మర్చన్ చదివి వినిపించారు. వాటిలో దేనితోనూ తనకు సంబంధం లేదని ట్రంప్ వాంగ్మూలమిచ్చారు. ప్రతి అభియోగాన్నీ చట్టపరంగా ఎదుర్కొంటారని ఆయన లాయర్లు తెలిపారు. సుమారు గంటపాటు సాగిన విచారణ అనంతరం ఆయన విడుదలై ఫ్లోరిడాకు పయనమయ్యారు. కోర్టులో ఆయన విచారణ సందర్భంగా న్యూయార్క్‌లో మన్‌హాటన్ జ్యూరీ లేన్ మొత్తం మీడియాతో కిక్కిరిసిపోయింది. విచారణ నేపథ్యంలో కోర్టు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఏమిటీ హుష్ మనీ కేసు?
2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు అడల్ట్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో అఫైర్‌ను కప్పిపుచ్చేందుకు ఆమెకు 130,000 డాలర్లు (సుమారు రూ.కోటి) చెల్లించారని ట్రంప్‌పై ఆరోపణలున్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ మాజీ న్యాయవాది మైఖేల్ కోహెన్ ఈ చెల్లింపు చేశారు. ఈ కేసులో కోహెన్ జైలు శిక్షను ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంలో ట్రంప్‌పై క్రిమినల్ నేరాభియోగాలు నమోదయ్యాయి. దీంతో అమెరికా చరిత్రలో క్రిమినల్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షునిగా ట్రంప్ నిలిచారు.
వివాదాల రికార్డులు
ట్రంప్‌పై ఏ అమెరికా అధ్యక్షుడికీ లేనన్ని రిమార్కులు ఉన్నాయి. రెండుసార్లు అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా, క్రిమినల్ కేసులో అభియోగాలు నమోదైన తొలి అమెరికన్ ప్రెసిడెంట్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. వీటితో పాటు అడల్ట్ స్టార్‌కు డబ్బులిచ్చిన ప్రెసిడెంట్ కూడా ఆయనే. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ ట్రంప్ రికార్డు నెలకొల్పారు. తాను ఎవరినైనా కాల్చగలనని చెప్పిన మొదటి అమెరికా అధ్యక్షుడిగా.. కోపంతో కెచప్ విసిరిన తొలి అమెరికన్ ప్రెసిడెంట్‌గా ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు.
మద్దతుదారులకు మెయిల్
కోర్టుకు హాజరు కావడానికి కొన్ని గంటల ముందు డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులకు ఈమెయిల్ పంపారు. అరెస్టుకు ముందు ఇదే చివరి ఈమెయిల్ అని అందులో పేర్కొన్నారు. మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అనుసరించే తృతీయ ప్రపంచ దేశంగా అమెరికా మారుతోందని ట్రంప్ ఆరోపించారు. న్యాయ వ్యవస్థ సచ్చీలతను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాలని మద్దతుదారులకు సూచించారు. ‘నా అరెస్టుకు ముందు పంపే చివరి ఈ మెయిల్ ఇదే. ఈ రోజు దేశంలో న్యాయాన్ని హత్య చేసినందుకు మనం నివాళులర్పిద్దాం. ఏ నేరం చేయకపోయినా ప్రత్యర్థి పార్టీ నేతను అరెస్టు చేసేందుకు అధికార పార్టీ కుట్ర పన్నింది. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు నాకే కాదు.. దేశం మొత్తానికి విషాదకరం. అయినా ఆశ కోల్పోవద్దు. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యం నుంచి స్వాతంత్య్రం సాధించిన దేశం మనది. రెండు ప్రపంచ యుద్ధాలను గెలిచాం. చంద్రుడిపై అడుగుపెట్టాం. అది మన రక్తంలోనే ఉంది. నాకు నమ్మకం ఉంది. కచ్చితంగా 2024లో శ్వేతసౌధంలో అడుగుపెడతాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. సోమవారం ఫ్లోరిడా నుంచి బయలుదేరే ముందు కూడా ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో తనను నిరంతరం వేధిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లింపు వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు.