కరీంనగర్‌లో మంగళవారం అర్థరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిడ్‌నైట్‌లో భారీ సంఖ్యలో బండి సంజయ్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. 


కరీంనగర్‌ అడిషనల్‌ డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఏసీపీలు, సీఐలు, యాభై మంది పోలీసులు బండి సంజయ్‌ ఇంటికి చేరుకున్నారు. అరెస్టు చేస్తున్నామని బండి సంజయ్‌కు చెప్పారు. అయితే ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వారెంటు ఉందా అని నిలదీశారు. అయినా పోలీసులు తమ పని తాము చేసుకొని వెళ్లారు. కార్యకర్తలు అడ్డుకుంటున్నా... సంజయ్‌ ప్రతిఘటిస్తున్నా పోలీసులు మాత్రం ఆయన్ని అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకెళ్లారు. మార్గ మధ్యలో కాన్వాయ రిపేర్‌ అయింది. వెంటనే వేరే వాహనాన్ని తెప్పించి హైదరాబాద్‌ తరలించారు.   


బండి సంజయ్‌ ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారని ఆయన్ని అరెస్టు చేస్తున్నారని తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట కూడా జరిగింది.






నేడు పేపర్ లీకేజీపై ప్రెస్ మీట్ పెడతానన్న బండి


బండి సంజయ్ అత్తమ్మ (సతీమణి అపర్ణ తల్లి) చనిపోయి రేపటికి 9వ రోజు. ఆ రోజు జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం (ఏప్రిల్ 4) అర్ధరాత్రి కరీంనగర్ జ్యోతి నగర్ లోని తన ఇంటికి బండి సంజయ్ వచ్చారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో బీఆర్ఎస్ బండారాన్ని బయటపెడతానని, నేడు (ఏప్రిల్ 5) ఉదయం 9 గంటలకు ప్రెస్ మీట్ పెడతానని బండి సంజయ్ నిన్ననే ప్రకటించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అర్ధరాత్రి బండి సంజయ్ ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేశారు. సోఫాలో కూర్చొని ఉన్న బండి సంజయ్‌ను అరెస్టు చేస్తామని ఆయనతో చెప్పగా ఏ కేసుపైన అరెస్టు చేస్తున్నారని బండి సంజయ్ ఎదురు ప్రశ్నించారు. అందుకు పోలీసులు సమాధానం చెప్పలేదు. కనీసం అరెస్టు వారెంటు ఉందా? అని ప్రశ్నించగా అది కూడా లేదని పోలీసులు చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాక విషయం చెప్తామని అన్నారు.


మరి తనను ఎందుకు అరెస్టు చేస్తారని బండి సంజయ్ నిలదీశారు. ముందస్తు జాగ్రత్త కింద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అరెస్టు చేస్తున్నట్లుగా పోలీసులు ఉన్నతాధికారులు చెప్పారు. అలా ఎలా చేస్తారని ప్రశ్నిస్తుండగానే పోలీసులు బండి సంజయ్‌ను బలవంతంగా ఎత్తుకొని బయటకు తీసుకొచ్చారు. అడ్డువచ్చిన ఆయన అనుచరులను తోసేశారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొత్తానికి బండి సంజయ్‌ను అరెస్టు చేశారు. అయితే, ఆయన్ను ఏ స్టేషన్ కు తరలించారనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. హైదరాబాద్ వైపు తీసుకొస్తుండగా లోయర్ మానేర్ డ్యాం వద్ద వాహనం మొరాయించగా, మరో వాహనంలోకి మార్చారు. బీజేపీ కార్యకర్తలు, బండి సంజయ్ అనుచరులు వెనకే మరో వాహనంలో వెళ్లారు. బండి సంజయ్‌ను యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా తెలిసింది.