నెల్లూరు నగరంలో చిన్నారి మిస్సింగ్ వ్యవహారం విషాదాంతం అయింది. ఏడాదిన్నర వయసున్న హారిక ఆదివారం నుంచి కనిపించడం  లేదు. ఎవరైనా పాపను కిడ్నాప్ చేసి ఉంటారని అనుకున్నారు. కానీ అలాంటి సమాచారమేదీ లేదు. చివరకు చిన్నారి శవం సర్వేపల్లి కాల్వలో కనపడింది. కాల్వ నుంచి చిన్నారి శవాన్ని గజ ఈతగాళ్ల సాయంలో పోలీసులు బయటకు తీశారు. కిడ్నాప్‌నకు గురైందనుకున్న పాప చివరకు శవమై తేలడంతో నెల్లూరులోని గుర్రాలమడుగులో విషాద ఛాయలు అలముకున్నాయి. 


నెల్లూరు నగరంలోని గుర్రాలమడుగులో గత ఆదివారం రాత్రి చిన్నారి మిస్ అయింది. ఇంట్లో ఊయలలో పడుకున్న చిన్నారి తెల్లారే సరికి కనిపించకుండా పోయింది. ఊయలలో బొమ్మని పెట్టి చిన్నారిని ఎవరో ఎత్తుకెళ్లారు. దీంతో పాప తల్లి తల్లడిల్లిపోయింది. పాప కిడ్నాప్ కి గురైంది అంటూ పోలీసు కేసు పెట్టారు. పోలీసులు కూడా సీసీ టీవీ ఫుటేజీని సేకరించి ఈ కేసుని ఛేదించే ప్రయత్నం చేశారు. కానీ గుర్రాల మడుగు సంఘంలో సమీపంలో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసుని ఛేదించడం సాధ్యం కాలేదు. దీంతో పోలీసులు కూడా వేచి చూశారు. చివరకు రాత్రి చిన్నారి శవం సర్వేపల్లి కాల్వలో తేలుతూ కనపడింది. దీంతో ఈ కిడ్నాప్ వ్యవహారం విషాదాంతం అయింది. 


సర్వేపల్లి కాలువలో చిన్నారి హారిక మృతదేహం లభ్యం అయ్యింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. మంగళవారం అర్థరాత్రి దాటాక గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీయించారు. ఆ చిన్నారి మృతదేహాన్ని చూసి ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.  మరోవైపు ఈ మిస్సింగ్‌ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. హారిక మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 


నెల్లూరు గుర్రాలమడుగు సంఘానికి చెందిన అనూష, రావూరుకు చెందిన మణికంఠకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ఇద్దరూ కుమార్తెలే. మణికంఠ హోటల్‌ నిర్వహిస్తుంటాడు. అనూష చదువుకున్న అమ్మాయి. అనూష ఉన్నత చదువుల కోసం నెల్లూరుకి వచ్చి భర్తకు దూరంగా తల్లి దగ్గరే ఉంటోంది. నెల్లూరులో ఉంటూ ఎంసీఏ చదువుకుంటోంది. రాపూరు నుంచి భర్త మణికంఠ అప్పుడప్పుడు నెల్లూరు వచ్చి భార్య ఇద్దరు పిల్లల్ని చూసి వెళ్తుంటాడు. 


ఆదివారం తల్లి బయటకు వెళ్లడంతో.. పిల్లల్ని తీసుకుని దగ్గర్లోనే ఉన్న పిన్ని ఇంటికి వెళ్లింది అనూష. అక్కడే రాత్రి పడుకుంది. కరెంటు పోవడంతో తలుపులు తీసి వారు ఆరుబయట నిద్రించారు. లోపల ఊయలలో హారిక పడుకుంది. ఉదయం లేచి చూసేసరికి.. ఊయలలో ఏడాదిన్నర వయసున్న హారికకు బదులు.. బొమ్మ ఉంది. దీంతో ఆందోళనకు గురై భర్తకు సమాచారం అందించగా మణికంఠ కూడా అక్కడికి వచ్చాడు. అంతా కలిసి చుట్టుపక్కల గాలించారు, తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


తెలిసినవారి పనే..
కుటుంబ కలహాల నేపథ్యంలోనే చిన్నారి హత్యకు గురైందని అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే ఇరు కుటుంబాల మధ్య ఉన్న గొడవలేంటో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అది కచ్చితంగా రక్త సంబంధీకుల పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల విచారణలో అందిన సమాచారం మేరకే కాలువలో గాలింపు చేపట్టారని తెలుస్తోంది. పోలీసులు మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించాకే అసలు కారణం తెలుస్తుంది.