Forbes Billionaire list 2023: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ అదానీ మీద పైచేయి సాధించారు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడి పీఠాన్ని తిరిగి కైవసం చేసుకున్నారు. కొన్నాళ్ల క్రితం, గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముకేష్ అంబానీని అధిగమించారు. ఈసారి పోటీలో ముకేష్ అంబానీ గెలిచారు. 


ముకేష్‌ అంబానీకి ఎంత ఆస్తి ఉంది?
65 ఏళ్ల ముకేశ్ అంబానీ, 83.4 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఫోర్బ్స్ బిలియనీర్ లిస్ట్‌లో ‍‌టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 9వ స్థానంలో నిలిచారు. ఈ లిస్ట్‌లో, LVMH ఓనర్‌ బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ 211 బిలియన్‌ డాలర్లు. ఎలాన్‌ మస్క్‌ 180 బిలియన్‌ డాలర్లతో, జెఫ్‌ బెజోస్‌ 114 బిలియన్‌ డాలర్లతో 2, 3 ర్యాంకుల్లో ఉన్నారు.


గత సంవత్సరం, ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో ముకేష్‌ అంబానీ 10వ స్థానంలో ఉన్నారు.అప్పుడు ఆయన ఆస్తుల నికర విలువ 90.7 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది, మైక్రోసాఫ్ట్‌కు చెందిన స్టీవ్ బాల్మర్, గూగుల్ లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌ల కంటే ముకేశ్ అంబానీ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. అంతేకాదు, ఫేస్‌బుక్‌ మార్క్ జుకర్‌బర్గ్, డెల్ టెక్నాలజీస్‌ మైఖేల్ డెల్‌ కంటే కూడా ముందున్నారు. 


గౌతమ్ అదానీకి అత్యంత భారీ నష్టం
వ్యక్తిగత సంపదలో భారీ నష్టంతో, ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో గౌతమ్‌ అదానీ 24వ స్థానానికి చేరుకున్నారు. ఈ ఏడాది జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు వచ్చినప్పటి నుంచి అదానీ గ్రూప్ విలువ, తద్వారా గౌతమ్‌ అదానీ వ్యక్తిగత ఆస్తుల విలువ క్షీణించాయి. జనవరి 24న, గౌతమ్ అదానీ ప్రపంచ అత్యంత సంపన్నుల లిస్ట్‌లో మూడో స్థానంలో ఉన్నారు, అప్పుడు అతని నికర విలువ 126 బిలియన్‌ డాలర్లు. ఇప్పుడు, సగం కంటే ఎక్కువే తగ్గింది, 47.2 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది.


బిలియనీర్ల లిస్ట్‌లో HCL టెక్‌ శివ్ నాడార్
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ ఛైర్మన్‌, స్వశక్తితో సంపన్నుడిగా ఎదిగిన శివ్ నాడార్ నికర విలువ 25.6 బిలియన్‌ డాలర్లుగా ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రపంచ బిలియనీర్స్ లిస్ట్‌లో ఆయన 55వ ర్యాంక్‌ సాధించారు, భారతీయుల్లో మూడో స్థానంలో ఉన్నారు.


భారతదేశ సంపన్నుల సంఖ్య పెరిగింది
ఫోర్బ్స్ బిలియనీర్ల ప్రపంచ ర్యాంకింగ్ గత సంవత్సరం 2,668గా ఉండగా, 2023లో 2,640 కి క్షీణించింది. అంటే, ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ భారత్‌ నుంచి బిలియనీర్ల సంఖ్య పెరిగింది. 2022లో ఈ నంబర్‌ 166 గా ఉండగా ఈ సంవత్సరం 169 కి పెరిగింది. కానీ వీళ్లందరి ఉమ్మడి సంపద మాత్రం 750 బిలియన్‌ డాలర్ల నుంచి 10 శాతం తగ్గి 675 బిలియన్‌ డాలర్లకు చేరింది.


అమెరికాలో అత్యధిక బిలియనీర్లు
ఫోర్బ్స్ ప్రకారం, అత్యధిక బిలియనీర్‌ల రికార్డ్‌ను అమెరికా కంటిన్యూ చేస్తోంది. అగ్రరాజ్యం నుంచి 735 మంది ఈ జాబితాలో ఉన్నారు. వాళ్లందరి సంపద విలువ కలిపి 4.5 ట్రిలియన్‌ డాలర్లు. 2 ట్రిలియన్ డాలర్ల విలువైన 562 బిలియనీర్లతో చైనా (హాంకాంగ్, మకావుతో సహా) రెండో స్థానంలో ఉంది. 675 బిలియన్ డాలర్ల విలువైన 169 బిలియనీర్లతో భారతదేశం రెండవ స్థానంలో ఉంది.