Coronavirs Cases India:
పంచసూత్రాలు..
దేశవ్యాప్తంగా మరోసారి కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అటు ఫ్లూ కూడా వ్యాప్తి చెందుతోంది. ఫలితంగా ఆసుపత్రులు బాధితులతో నిండిపోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇప్పటికే అత్యున్నత స్థాయి భేటీ జరిగింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. ఇప్పుడు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కూడా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు 5 సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఇవే సూత్రాలు అమలు చేయాలని స్పష్టం చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్‌తో పాటు కొవిడ్ నిబంధనలు పాటించాలని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి మాక్ డ్రిల్ కూడా చేస్తామని కేంద్రం వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇది అమలవుతుందని తెలిపింది. వీటితోపాటు కొవిడ్, ఇన్‌ఫ్లుయెంజా మందులు అందుబాటులో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని ఆదేశించింది కేంద్రం. అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇవి తప్పకుండా అందుబాటులో ఉండాలని చెప్పింది. ఒకవేళ ఉన్నట్టుండి బాధితుల సంఖ్య పెరిగితే..అందుకు తగ్గట్టుగా పడకలు ఉన్నాయో లేదో ముందే జాగ్రత్త పడాలని తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 220 కోట్లకుపైగా వ్యాక్సిన్‌లు అందించినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
"ప్రస్తుతానికి హాస్పిటలైజేషన్ పెరుగుతున్నట్టు ఎక్కడా ఆధారాలు లేవు. ఏదేమైనా ప్రికాషనరీ డోస్‌లు తీసుకోవాలి. వీటి సంఖ్య పెంచాలి. టెస్టింగ్‌ల సంఖ్య కూడా పెంచాలి. ఎప్పటికప్పుడు వైరస్ వ్యాప్తిపై నిఘా పెట్టాలి"
- కేంద్ర ఆరోగ్య శాఖ
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (మార్చి 22న) దేశంలో కరోనా స్థితిగతులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న కరోనా వ్యాప్తి, హెచ్‌ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కేసులపై చర్చించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి మోదీ, దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సైతం సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశంలో పెరుగుతున్న కేసులపై ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారని పిటిఐ రిపోర్ట్ చేసింది. ఇన్‌ఫ్లుయెంజా పరిస్థితిపై, ముఖ్యంగా గత కొన్ని నెలలుగా దేశంలో నమోదవుతున్న హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 కేసుల సంఖ్య పెరిగిన తీరును ప్రధాని మోదీకి వివరించారు. అయితే మూడేళ్ల కిందట 2020 తరహాలోనే ప్రజలు శ్వాస వ్యవస్థకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఊపిరితిత్తుల ఆరోగ్యం కాపాడుకోవాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కేసుల చికిత్స కోసం కేంద్రం ఇటీవల సవరించిన మార్గదర్శకాల ప్రకారం, ప్లాస్మా థెరపీని ఉపయోగించవద్దని వైద్యులకు సూచించింది. లోపినావిర్ - రిటోనావిర్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఐవర్‌మెక్టిన్, మోల్నుపిరావిర్, ఫావిపిరావిర్, అజిత్రోమైసిన్ తో పాటు డాక్సీసైక్లిన్ మెడిసిన్ ను వయోజనులకు కోవిడ్-19 చికిత్సలో భాగంగా వినియోగించకూడదని మార్గదర్శకాలలో పేర్కొంది.
Also Read: Unesco Report: మరో పాతికేళ్ల తర్వాత భారత్‌లో నీళ్లు దొరకవట - భయపెడుతున్న యునెస్కో రిపోర్ట్