భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రధాని మోదీని కలిశారు. గురువారం (మార్చి 23) కోమటిరెడ్డి ప్రధానితో భేటీ అయ్యారు. అనంతరం అనంతరం ఆయన మీడితో మాట్లాడారు. వర్షాల వల్ల పంట నష్టం విషయంలో మోదీని కలిసినట్లుగా చెప్పారు. కేంద్రం నుంచి ఓ టీమ్‌ను పంట నష్టంపై అంచనాకు తెలంగాణకు పంపాలని కోరినట్లు వెల్లడించారు. తన నియోజకవర్గంలో జాతీయ రహదారులపై చర్చించానని కూడా పేర్కొన్నారు. ఎల్బీ నగర్‌ నుంచి మెట్రో రైలును హయత్ నగర్‌ వరకూ పొడిగించాలని కోరానని అన్నారు. తన వినతుల పట్ల ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి వివరించారు.


‘‘నేను - ప్రధాని మోదీ మాట్లాడుకున్న వాటిలో కొన్ని అంశాలు మీడియాతో చెప్పలేనివి ఉంటాయి. నేను లేవనెత్తిన అన్ని అంశాలపై ప్రధాని చాలా సానుకూలంగా స్పందించారు. వాటికి రెండు, మూడు నెలలలో ఆయన అన్నీ మంజూరు చేసే అవకాశం ఉంది. ప్రధానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలంగాణలో వడగళ్ల వానతో రైతులు నష్ట పోయారు. కేంద్రం నుంచి పరిశీలనకు బృందాన్ని పంపాలని కోరాను’’ అని కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 


పంట నష్టంపై ఎల్లుండి ప్రధాని మోదీని కలుస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మొన్ననే (మార్చి 21) చెప్పారు. ఎమ్మెల్సీ కవిత ఈడీ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని అన్నారు‌. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌లో కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని వెంకట్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ నిరుద్యోగుల ఉసురు కేసీఆర్ ప్రభుత్వానికి తగులుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం త్వరలో పాదయాత్ర చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెండు రోజుల క్రితం అన్నారు.