టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్ లీకేజీ వ్యవహారంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయనకు ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని సిట్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు సిట్ కార్యాలయానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. దీంతో పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు హౌజ్ అరెస్టులు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సిట్ కార్యాలయానికి తరలివస్తే గందరగోళ పరిస్థితి నెలకొంటుందని భావించి వారిని ఎక్కడికక్కడ హౌజ్ అరెస్ట్‌లు చేస్తూ నిలువరిస్తున్నారు. 


కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, షబ్బీర్ అలీ, మల్లు రవి సహా పలువురు సీనియర్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. హిమాయత్ నగర్ లో ఉన్న సిట్ ఆఫీసు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి సిట్ ఆఫీసుకు వెళ్తున్న క్రమంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో మంత్రి కేటీఆర్ పీఏ హస్తం ఉందంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడంతో ఆయనకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు (మార్చి 23) సిట్ ఎదుట హాజరై టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఆధారాలను రేవంత్ రెడ్డి అందించనున్నారు.


ప్రస్తుతం హిమాయత్ నగర్ సిట్ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిట్ ఆఫీస్ కు వెళ్లే రెండు దారుల్లోనూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలెవరూ రాకుండా పోలీసులు భద్రత పెంచారు. రేవంత్ వాహనాన్ని మాత్రమే సిట్ కార్యాలయం వద్దకు పోలీసులు అనుమతించనున్నారు. ఇప్పటికే కార్యాలయానికి సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ చేరుకున్నారు. ప్రస్తుతం సిట్ కార్యాలయం బయట పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఉన్నారు.