Revanth Reddy : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై వ్యవహారంలో సిట్ దర్యాప్తు రాజకీయరంగు పులుముకుంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులకు నోటీసులు ఇచ్చింది సిట్. గురువారం సిట్ ముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీంతో కాంగ్రెస్ కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో సిట్ కార్యాలయానికి వెళ్లే సమయంలో ఉద్రిక్తత నెలకొంది. రేవంత్ రెడ్డికి నోటీసులకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ తో పాటు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సిట్ కార్యాలయం లోపలికి రేవంత్ రెడ్డిని మాత్రమే అనుమతించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సిట్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
కేటీఆర్ ను బర్త్ రఫ్ చేయాలి
రేవంత్ పాటు సిట్ కార్యాలయం వద్దకు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకువచ్చారు. ఐటీ మినిస్టర్ కేటీఆర్ ను బర్త్ రఫ్ చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. సిట్ కార్యాలయానికి గ్రూప్ 1 పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన వారి వివరాలతో రేవంత్ రెడ్డి వచ్చారు. సిట్ కార్యాలయంలోపలికి రేవంత్ రెడ్డిని మాత్రమే అనుమతించారు పోలీసులు.
సిట్ కాదు సీబీఐ విచారణ - రేవంత్ రెడ్డి
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్ కాదు సీబీఐ విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ అక్రమాల పుట్ట అని తేలిపోయిందని ఆరోపించారు. పెద్దల హస్తం లేనిదే పరీక్ష పత్రాలు లీకేజీ సాధ్యం కాదని ప్రజలకు అర్థమైందన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ – కేటీఆర్ అండ్ కో నియమించిన “సిట్” విచారణకు పిలిచిందన్నారు. తప్పును ఎత్తి చూపడమే నేరమట, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని రేవంత్ రెడ్డి అన్నారు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ కోసం కొట్లాడుతానన్నారు. 30 లక్షల నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడతానన్నారు.
కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్ లు
కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన నేపథ్యంలో మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీని హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ధర్నా కార్యక్రమానికి బయలుదేరుతున్న సమయంలో పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. తెలంగాణ నిరుద్యోగ యువతకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందన్నారు. అసలైన నిందితులను వొదిలేసి ప్రతిపక్షాల మీద పడటం కరెక్ట్ కాదన్నారు. న్యాయం జరిగేవరకు పోరాడుతామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని అద్దంకి దయాకర్ అన్నారు.