కరోనా బాధితుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ నిర్థారణ పరీక్షలపై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిడ్ కాంటాక్ట్స్ లో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు, కోవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న తప్ప మిగిలిన వారు కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది.   ఐసీఎమ్ఆర్ తాజా సూచనల ప్రకారం కోవిడ్ లక్షణాలు లేని అంతర్రాష్ట్ర ప్రయాణాలు చేసే వారికి కోవిడ్ పరీక్షలు చేయవలసిన అవసరం లేదని పేర్కొంది.  కోవిడ్ లక్షణాలు లేని వ్యక్తులు, హోమ్ ఐసోలేషన్, కోవిడ్ చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన వారికి అంతర్రాష్ట ప్రయాణాల్లో కోవిడ్ పరీక్షలు చేయవలసిన అవసరంలేదని పేర్కొంది.    






ఎవరికి కోవిడ్ పరీక్షలు చేయాలంటే..?


"దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, శ్వాస ఆడకపోవడం, ఇతర శ్వాసకోశ లక్షణాలు ఉన్నవారికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయాలి" అని ఐసీఎంఆర్ తెలిపింది. ఆసుపత్రులలో శస్త్రచికిత్సలు, ప్రసవాలు వంటి అత్యవసర వైద్యానికి కరోనా పరీక్ష లేకపోవడంతో ఆలస్యం చేయకూడదని పేర్కొంది. కోవిడ్ పరీక్షా సౌకర్యం లేని కారణంగా రోగులను ఇతర ఆసుపత్రులకు పంపవద్దని, వైద్యం అందించాలని ఐసీఎంఆర్ ఆదేశించింది.  


శస్త్రచికిత్స లేదా నాన్-సర్జికల్ ప్రసవానికి ఆసుపత్రిలో చేరిన గర్భిణీ స్త్రీలలో లక్షణం లేని వారికి కోవిడ్ పరీక్షలు అవసరంలేదు. ఏవైనా కోవిడ్ లక్షణాలు ఉంటే తప్ప వారికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయనవసరంలేదని ఐసీఎంఆర్ ప్రకటనలో పేర్కొంది.  కోవిడ్ నిర్థారణకు RT-PCR, TrueNat, CBNAAT, CRISPR, RT-LAMP, ర్యాపిడ్ మాలిక్యులర్ టెస్టింగ్ సిస్టమ్స్ లేదా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT) ద్వారా పరీక్షలు చేపట్టవచ్చని సూచించింది. "పాజిటివ్ పాయింట్-ఆఫ్-కేర్ టెస్ట్ (హోమ్ లేదా స్వీయ పరీక్ష), ర్యాపిడ్ మాలిక్యులర్ పరీక్షకు ఎటువంటి పునరావృత పరీక్ష లేకుండా నిర్ధారణగా పరిగణించాలని తెలిపింది. రోగ లక్షణాలున్న వ్యక్తులకు స్వీయ పరీక్షలో నెగిటివ్ వస్తే RAT, RT-PCR పరీక్షను చేపట్టాలని ICMR తెలిపింది. 


Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది


దేశంలో నమోదవుతున్న కేసుల్లో 5 నుంచి 10 శాతం కేసుల్లో మాత్రమే ఆసుపత్రి వైద్యం అవసరం ఉంటుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్నారు. కానీ ఈ పరిస్థితులు వేగంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సోమవారం దేశంలో 1,79,723 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇవి దాదాపు 227 రోజులలో అత్యధికం. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇప్పటి వరకూ నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033గా ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి