Congress Slams PM Modi:


ఏజెన్సీలతో కుమ్మక్కయ్యారు: కాంగ్రెస్ 


కాంగ్రెస్ ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేసింది. 2024 ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయన ఇజ్రాయేల్‌ సంస్థలతో కుమ్మక్కయ్యారని విమర్శించింది. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించగా...సుప్రియ శ్రీనతే, పవన్ ఖేడా ఈ ఈ ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యంతో ప్రధాని మోదీ ఆటలాడుతున్నారంటూ మండి పడ్డారు. ఇజ్రాయేల్ ఏజెన్సీలతో కుమ్మక్కై భారత్‌లోని ఎన్నికను ప్రభావితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


"భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారు. విదేశాలతో చేతులు కలిపి ఇక్కడ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారు" 


-పవన్ ఖేడా,కాంగ్రెస్ ప్రతినిధి 


పవన్ ఖేడాతో పాటు సుప్రియ శ్రీనతే కూడా ప్రధానిపై సంచలన ఆరోపణలు చేశారు. 


"ప్రపంచంలోని మూడు దేశాల ఎన్నికలను ఇజ్రాయేల్ కాంట్రాక్టర్లు ప్రభావితం చేశారని కొన్ని అంతర్జాతీయ సంస్థలతో పాటు జర్నలిస్ట్‌ గ్రూప్‌లు వెల్లడించాయి. అబద్ధాలను ప్రచారం చేయడనే ఆ కాంట్రాక్టర్ల పని. ఇలాంటి ఏజెన్సీలు  భారత్‌లోనూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా అలాంటి సంస్థలు ఇండియాలో ఉండనే ఉండవు. బీజేపీ ఐటీ సెల్‌తో పాటు ఆ ఏజెన్సీలు కూడా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి" 


-సుప్రియా శ్రీనతే, కాంగ్రెస్ ప్రతినిధి 


రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన భారత్ జోడో యాత్రపైనా బీజేపీ విషం చిమ్మిందని మండి పడింది కాంగ్రెస్. పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేసిన ఓ బాలిక రాహుల్‌ని కలిసిందంటూ కొన్ని ఫేక్ వీడియోలతో ప్రచారం చేశారంటూ విమర్శించారు సుప్రియ శ్రీనతే. రాహుల్ గాంధీపైనా వ్యక్తిగత విమర్శలు చేశారని మండిపడ్డారు. రాహుల్ భారత్ జోడో యాత్రలో 113 సార్లు భద్రతా నిబంధలను ఉల్లంఘించారంటూ సీఆర్‌పీఎఫ్ అప్పట్లో ఓ ప్రకటన చేసింది. దీనిపైనా బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరిగింది.