Dhoni Gifts to Yogi Babu: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత నాయకుడు ఎంఎస్ ధోనీ నిర్మాతగా అవతారం ఎత్తారు. ధోనీ ఎంటర్ టైన్ మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ తొలి తమిళ చిత్రంగా ఎల్జీఎమ్ (లెట్స్ గెట్ మ్యారీడ్)ను ప్రకటించారు. ఆ చిత్రంలో నటిస్తున్న ప్రముఖ కమెడియన్, నటుడు యోగిబాబును ధోనీ సర్ ప్రైజ్ చేశాడు.
ధోనీ ఎంటర్టైన్ మెంట్స్ తొలి చిత్రంగా లెట్స్ గెట్ మ్యారీడ్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో లవ్ టుడే ఫేమ్ ఇవానా, ప్రముఖ నటి నదియా, హరీష్ కల్యాణ్, యోగి బాబు తదితరులు నటిస్తున్నారు. ఇటీవలే దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కామెడీ, కుటుంబ కథాచిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటిస్తున్న యోగిబాబుకు ఎంఎస్ ధోనీ ప్రత్యేకమైన బహుమతిని అందించారు. తను సంతకం చేసిన బ్యాట్ ను అతనికి పంపించారు. ఆ బ్యాట్ ను పట్టుకుని యోగిబాబు దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యోగి బాబుకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. తీరిక దొరికినప్పుడల్లా ఆయన క్రికెట్ ఆడుతూ కనిపిస్తుంటారు. మూవీ లొకేషన్లలోనూ అప్పుడప్పుడు బ్యాట్ పట్టుకుని దర్శనమిస్తుంటారు. యోగి క్రికెట్ ఆడుతున్న వీడియోలు అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుంటాయి.
ఐపీఎల్ కోసం ధోనీ ప్రాక్టీస్
మహేంద్రసింగ్ ధోనీ ప్రస్తుతం ఈ ఏడాది ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక 2023 ఐపీఎల్ సీజనే ధోనికి చివరిదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆటగాడిగా, కెప్టెన్ గా ఈ సీజన్ లో జట్టుకు కప్పును అందించి ధోని రిటైరవుతాడేమో చూడాలి. ఇకపోతే 2022లో జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను భారీ ధరకు దక్కించుకుంది. ధోనీ తర్వాత జట్టు పగ్గాలు బెన్ స్టోక్స్ కే అందిస్తారనే అంచనాలు ఉన్నాయి.