Mani Shankar Aiyar Row: కాంగ్రెస్‌కి సీనియర్లు తలనొప్పి తెచ్చి పెడుతున్నారు. ఇప్పటికే శ్యాం పిట్రోడా పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడేశారు. ఆయన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నా ఆ మరక మాత్రం అలాగే ఉండిపోతోంది. పైగా బీజేపీ పదేపదే ఇవే వ్యాఖ్యల్ని ఉదాహరణగా చూపిస్తూ కాంగ్రెస్‌ని మరింత దెబ్బ కొడుతోంది. ఇప్పుడు మరో సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ (Mani Shankar Aiyar) ఇదే విధంగా చిక్కుల్లోకి నెట్టారు. పాకిస్థాన్‌ని భారత్ గౌరవించాలని అన్నారు. అంతే కాదు. సమస్యల్ని చర్చలతో పరిష్కరించుకోవాలని, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పాకిస్థాన్‌ వద్ద అణుబాంబులున్నాయని, వాళ్లతో పెట్టుకుంటే మనపై ఆ బాంబులతో దాడి చేసే ప్రమాదముందని అన్నారు. ఈ కామెంట్స్‌పై బీజేపీ తీవ్రంగా మండి పడుతోంది. కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ వీడియోని షేర్ చేశారు. ఇదీ కాంగ్రెస్ ఐడియాలజీ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


"పాకిస్థాన్‌తో మనం చర్చించాలి. ఆ విధంగానే సమస్యలు పరిష్కరించుకోవాలి. అందుకు బదులుగా మనం పదేపదే ఘర్షణ వాతావరణాన్ని సృష్టించుకుంటున్నాం. దీని వల్ల అనవసరంగా ఆందోళనలు పెరిగిపోతాయి. పాకిస్థాన్ వద్ద అణుబాంబులున్న సంగతిని మర్చిపోవద్దు. పిచ్చి వాడి చేతిలో బాంబులుంటే ఏమవుతుందో తెలుసుగా. మన వద్ద కూడా అణుబాంబులున్నాయి. కానీ...పాక్ ఒక్కసారి లాహోర్‌లో దీన్ని ప్రయోగిస్తే...ఆ ప్రభావం అమృత్‌సర్ వరకూ రావడానికి కేవలం 8 సెకన్ల సమయం పడుతుంది"


- మణిశంకర్ అయ్యర్, కాంగ్రెస్ సీనియర్ నేత






అయితే..ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తీవ్రంగా మండి పడ్డారు. X వేదికగా ఓ పోస్ట్ పెట్టి కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ చేతిలో ఉన్న కాంగ్రెస్ వైఖరి ఇదేనంటూ చురకలు అంటించారు. ఉగ్రవాదులతో సంబంధం ఉన్న సంస్థలకు సపోర్ట్ ఇవ్వడం, అవినీతికి పాల్పడడం, పేదల సొత్తును దోచుకోవడం...ఇవన్నీ కాంగ్రెస్‌ చేసిన పనులే అంటూ విమర్శించారు. 


"రాహుల్ గాంధీ సారథ్యంలో ఉన్న కాంగ్రెస్‌ వైఖరి ఇదీ. ఈ ఎన్నికల సమయంలో ఇది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. సియాచెన్‌ని పాక్ పరం చేసేందుకు జరుగుతున్న కుట్ర ఇది. అందుకే ఆ పార్టీ ఆ దేశానికి మద్దతునిస్తోంది. ప్రజల్ని ఇలా విడగొట్టడం, అవాస్తవాలు ప్రచారం చేయడం, తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్‌కి అలవాటే"


- రాజీవ్ చంద్రశేఖర్, కేంద్రమంత్రి


 Also Read: Covid -19 Vaccines: అన్ని కొవిడ్ వ్యాక్సిన్‌లను రివ్యూ చేయండి, వైద్యుల నుంచి వెల్లువెత్తుతున్న డిమాండ్‌లు