Covid 19 Vaccines in India: ఆస్ట్రాజెన్‌కా తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌పై (AstraZeneca) ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయని కొందరు ఫిర్యాదు చేయగా...అది నిజమే (Covishield Vaccines) అంటూ ఆ సంస్థే అంగీకరించింది. ఫలితంగా...ఈ టీకా తీసుకున్న వాళ్లంతా ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే భారత్‌లోని కొందరు వైద్యులు కొవిషీల్డ్‌తో పాటు అన్ని కొవిడ్ వ్యాక్సిన్‌లపై అనుమానాలు వ్యక్తం చేశారు. Awaken India Movement (AIM) పేరుతో ఉన్న వైద్యుల బృందం ఈ విషయం వెల్లడించారు. ఇప్పటి వరకూ అందుబాటులోకి వచ్చిన అన్ని కరోనా వ్యాక్సిన్‌లను ఎలా తయారు చేశారో తెలుసుకోవాల్సిన అవసరముందని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్ని టీకాలనూ రివ్యూ చేయాలని సూచించారు. వెంటనే అన్ని వ్యాక్సిన్‌లపై నిఘా పెట్టాలని, వీలైనంత త్వరగా వాటి పని తీరు ఎలా ఉందో తెలుసుకోవాలని వెల్లడించారు. కొవిడ్ వ్యాక్సిన్‌లు తీసుకున్న వాళ్లు చనిపోతున్నారంటూ ప్రచారం జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండి పడ్డారు. నిజానిజాలేంటో తెలుసుకోకుండా వ్యాక్సిన్‌లన్నీ సేఫ్ అంటూ చెప్పుకోవడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. 


"కొవిడ్ వ్యాక్సినేషన్ తరవాత నమోదైన మరణాలను ప్రభుత్వం పెద్దగా లెక్క చేయలేదు. అది అలా ఉంచి అన్ని వ్యాక్సిన్‌లు సురక్షితమే అంటూ ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు. ఇవి సురక్షితమే అనడానికి శాస్త్రీయ ఆధారాలు ఏమైనా ఉన్నాయేమో చెప్పండి. అప్పుడు మాత్రమే నమ్మగలం"


- వైద్యులు
 
ట్రయల్స్ పూర్తి కాకుండానే...


కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్లలో Thrombocytopenia Syndrome (TTS) సిండ్రోమ్‌ వ్యాధి వస్తుందన్న ఆరోపణలు ఆ సంస్థే ఒప్పుకోవడాన్ని వైద్యులు గుర్తు చేశారు. అయితే...కొవిడ్ 19 వ్యాక్సిన్‌లలో కొన్నింటికి థర్డ్ ఫేజ్ ట్రయల్స్ జరగకుండానే అందుబాటులోకి తీసుకొచ్చారన్న వాదనలూ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్‌లకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోకుండానే, వాటి వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్ ఉంటాయో లేదో గుర్తించకుండానే వినియోగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా టీకాలు తీసుకున్న తరవాత ఎలాంటి దుష్ప్రభావాలు ఉండొచ్చు అన్న అవగాహన కల్పించడంలోనూ ప్రభుత్వాలు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. వ్యాక్సిన్ తీసుకున్న తరవాత చాలా మంది మహిళల్లో మెనోపాజ్‌ సరిగ్గా రావడం లేదంటూ కంప్లెయింట్ చేస్తున్నారు. గతంలో దీనికి సంబంధించి కొన్ని రిపోర్ట్‌లు కూడా వెలుగులోకి వచ్చాయి. 


వివరాలు సేకరిస్తున్న వైద్యులు..


ఈ ఆరోపణలపైన వైద్యుల బృందం సమాచారం సేకరిస్తోంది. 2021లో వ్యాక్సినేషన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ అన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నట్టు తెలిపింది. అయితే..తాము అడిగిన ప్రశ్నలపై మాత్రం ప్రభుత్వం స్పందిచడం లేదని అసహనం వ్యక్తం చేస్తోంది. ఫాస్ట్‌ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ల కారణంగా ఇబ్బంది పడ్డ బాధితులకు న్యాయం చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే కొవిషీల్డ్ వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్టు ఆస్ట్రాజెన్‌కా ప్రకటించింది. ఇకపై ఎక్కడా ఈ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉండవని వెల్లడించింది. 


 Also Read: Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్న కేసులో ఊహించని మలుపు, బెదిరించి కేసు పెట్టించారంటూ మహిళ ఫిర్యాదు