Sengol Politics: 


సెంగోల్‌పై రాజకీయాలు..


నిన్న మొన్నటి వరకూ కర్ణాటక ఎన్నికలు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్. ఆ ఎన్నికల ఫలితాలు పొలిటికల్ హీట్‌ పెంచేశాయి. అప్పుడు రాజుకున్న మంట ఇంకా చల్లారలేదు. ఆ వెంటనే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై బీజేపీ, ప్రతిపక్షాల మధ్యల వర్డ్ వార్ మొదలైంది. ప్రధాని మోదీ పార్లమెంట్‌ని ప్రారంభించడంపైనే కాదు. సెంగోల్‌ని (Sengol) పార్లమెంట్‌లో అమర్చుతామన్న నిర్ణయమూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార బదిలీకి సంబంధించి, మన దేశ స్వాతంత్య్రంతో ముడిపడిన ముఖ్యమైన ఆ రాజదండానికి పార్లమెంట్‌లో సముచిత స్థానం కల్పిస్తామని చెబుతోంది బీజేపీ. అటు కాంగ్రెస్ మాత్రం "ఇదంతా బోగస్" అని తేల్చి పారేస్తోంది. అధికార బదిలీలో భాగంగానే సెంగోల్‌ని నెహ్రూకి ఇచ్చారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేస్తోంది. అసలు విషయాన్ని పక్కన పెట్టి తమిళనాడులో నిలదొక్కుకోడానికి బీజేపీ ఇలాంటి కొత్త వాదన వినిపిస్తోందని ఆరోపిస్తోంది.


బీజేపీ వాదన ఇలా..


దీనికి  బీజేపీ నేతలు కూడా గట్టిగానే బదులిస్తున్నారు. స్వయంగా కేంద్రమంత్రి అమిత్‌షానే రంగంలోకి దిగి వరుస ట్వీట్‌లతో విరుచుకుపడ్డారు. భారత దేశ సంస్కృతి అంటే కాంగ్రెస్‌కి ఎందుకంత విద్వేషం అంటూ మండి పడ్డారు. మే 28వ తేదీన లోక్‌సభ స్పీకర్ ఛైర్‌కు సమీపంలో ఈ సెంగోల్‌ని పొందుపరచనున్నారు. 


"భారతీయ సంస్కృతి అంటే కాంగ్రెస్‌కి ఎందుకంత విద్వేషం? పవిత్రమైన సెంగోల్‌ని తమిళనాడులోని ఓ శైవ మఠంలో అప్పటి ప్రధాని నెహ్రూకి అందజేశారు. అధికార బదిలీకి చిహ్నంగా ఈ తంతు నిర్వహించారు. కానీ...దానికి విలువనివ్వకుండా మ్యూజియంలో పెట్టారు. కేవలం దాన్ని ఓ వాకింగ్ స్టిక్‌లా చూశారు. కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు. ఆ శైవమఠమే స్వయంగా సెంగోల్‌కి ఉన్న పవిత్రతను వివరించింది. అయినా..కాంగ్రెస్ బోగస్ అని అనడం అవమానకరం"


- అమిత్ షా, కేంద్రహోం మంత్రి










కాంగ్రెస్ వాదన మరోలా..


అయితే...అటు కాంగ్రెస్ మాత్రం బీజేపీవి కేవలం రాజకీయ ఎత్తుగడలే అని విమర్శిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 


"తమిళనాడులో తమ ఉనికిని చాటుకోవడం కోసం ఈ సెంగోల్‌ని తెరపైకి తీసుకొచ్చారు. నిజాలను పక్కన పెట్టి వాటికి కొత్త అర్థాలు చెబుతున్నారు. ఓ మత సంస్థ 1947 ఆగస్టులో నెహ్రూకి ఇది బహూకరించింది. అప్పట్లో మద్రాస్‌ సిటీలో దీన్ని తయారు చేశారు. అంతే తప్ప...మౌంట్‌బట్టెన్ నెహ్రూకి అధికార బదిలీకి చిహ్నంగా ఇది ఇచ్చారనడానికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారాల్లేవు. బీజేపీ చెబుతున్నదంతా బోగస్. ఇది కేవలం బీజేపీ బలవంతంగా రుద్దుతున్న నిజం. వాట్సాప్ యూనివర్సిటీల్లోనూ ఇదే ప్రచారం చేస్తున్నారు"


- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత