Watch Video:
ఎంపీలను కొట్టారు, అరెస్ట్ చేశారు: రాహుల్ గాంధీ
దిల్లీలోని పార్టీ హెడ్‌క్వార్టర్స్ వద్ద కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగం సమస్యలపై నిరసనలు చేపడుతోంది కాంగ్రెస్. సీనియర్ నేతలతో కలిసి ప్రియాంక గాంధీ ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. కాసేపటికే మహిళా పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బారికేడ్లు దాటుకుని వచ్చి మరీ AICC హెడ్‌క్వార్టర్స్‌లోకి వెళ్లిన ఆమె, నిరసన చేపట్టారు. మహిళా పోలీసులు వచ్చి ఆమెను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ వీడియోను ANI తన ట్విటర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ కాంగ్రెస్ ర్యాలీ చేపట్టింది. ఇందులో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. పోలీసులు వచ్చి ఈ ర్యాలీని అడ్డుకుని రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు. కొందరు ఎంపీలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. "రాష్ట్రపతి భవన్ వైపు ఎంపీలందరూ ర్యాలీ చేపట్టారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలలాంటి సమస్యలకు వ్యతిరేకంగా ఇలా చేశారు. కానీ..వారిని లోపలకు అనుమతించలేదు. ప్రజా సమస్యల్ని చర్చించటమే మా విధి. కొందరు ఎంపీలను కొట్టారు. మరికొందర్ని అరెస్ట్ చేశారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ నియంతలా వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు. ఎన్నో శతాబ్దాలుగా ప్రజలు నిర్మించుకున్న భారత దేశాన్ని మన కళ్ల ముందే ధ్వంసం చేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. దిల్లీలో శుక్రవారం ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు రాహుల్ గాంధీ.