Mani Shankar Aiyar on Pakistan: కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థానీలు భారత్‌కి ఉన్న అతి పెద్ద ఆస్తి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన ఇలా మాట్లాడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. గతంలో తాను కుటుంబ సభ్యులతో సహా పాకిస్థాన్‌కి వచ్చినప్పుడు మరిచిపోలేని ఆతిథ్యం అందించారని గుర్తు చేసుకున్నారు. వాళ్లతో సన్నిహితంగా ఉంటే వాళ్లు కూడా స్నేహంగానే ఉంటారని వెల్లడించారు. పాకిస్థాన్‌కి సంబంధించి భారతీయులకు తెలియని ఎన్నో నిజాలున్నాయని స్పష్టం చేశారు. ఊహకు అందని విషయాలెన్నో ఉన్నాయని వెల్లడించారు.
"నాకు తెలిసినంత వరకూ పాకిస్థాన్ ప్రజలు సన్నిహితంగా ఉంటే వాళ్లూ సన్నిహితంగా ఉంటారు. మనం శత్రుత్వం పెట్టుకుంటే వాళ్లూ అలానే ప్రవర్తిస్తారు. దేనికైనా అతిగా స్పందించడం వాళ్ల నైజం. నేను గతంలో పాకిస్థాన్‌కి వచ్చాను. నాకు ఏ దేశంలోనూ లభించనంత ఘన స్వాగతం ఇక్కడ లభించింది. వాళ్లు నాకు చాలా గొప్పగా ఆతిథ్యం అందించారు. పాకిస్థానీలు భారత్‌కి విలువైన ఆస్తులు"
- మణిశంకర్ అయ్యర్, కాంగ్రెస్ నేత
కరాచీలో కాన్సులేట్ జనరల్‌గా పని చేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు మణిశంకర్ అయ్యర్. తనతో పాటు తన భార్యనీ ఎంతో గౌరవంగా చూసుకున్నారని స్పష్టం చేసినట్టు పాకిస్థాన్ మీడియా Dawn వెల్లడించింది. భారత్, పాకిస్థాన్ మధ్య చర్చలు మొదలవ్వాలని మణిశంకర్ ఆకాంక్షించినట్టు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది.
"భారతీయులు ఊహించిన దానికి పాకిస్థాన్ దేశవైఖరికి ఏ మాత్రం పొంతన లేదని మణిశంకర్ అయ్యర్ అన్నారు. ఆయన రాసిన పుస్తకంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రెండు దేశాల మధ్య చర్చలు తగ్గిపోయాయని అన్నారు. పాకిస్థానీలు భారత్‌తో మైత్రిని కోరుకుంటున్నట్టు మణిశంకర్ అయ్యర్ స్పష్టం చేశారు"
- పాకిస్థాన్ మీడియా