తెలంగాణ(Telangana)లో ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ(Telangana Assembly Sessions ) సమావేశాలే చాలా హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ శాఖల్లో విధ్వంసంపై బుధవారం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఆర్థిక స్థితిగతులపై వైట్‌పేపర్‌ రిలీజ్ చేసింది. గురువారం నాడు విద్యుత్‌ శాఖలో ఉన్న పరిస్థితిని సభ ముందు ఉంచింది.


రాష్ట్రానికి విద్యుత్ రంగమే కీలకం


అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేశారు. రాష్ట్రాభివృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పరిశ్రమల , వ్యవసాయ, సేవారంగాల అభివృద్ధికి విద్యుత్ సరఫరాయే వెన్నెముకని తెలిపారు. ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్తే అన్నారు. అలాంటి విద్యుత్ సంస్థలను నష్టాల్లో ఉంచి అప్పుల కుప్పగా తమకు అప్పగించాలని మండిపడ్డారు. 




ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులతోనే మేలు


ఆయన చెప్పిన వివరాల ప్రకారం... "తెలంగాణ ఏర్పడేనాటికి టిఎస్‌జెన్‌కోలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4365.26 మెగావాట్లు, రాష్ట్రం ఏర్పాటు కంటే ముందే తెలంగాణలో 2960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు ప్రణాళికలు, పనులను అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత అవే నాణ్యమైన విద్యుత్తు అందించడంలో కీలక పాత్ర పోషించాయి. 


బీఆర్‌ఎస్‌ పూర్తి చేసింది ఒకటే ప్రాజెక్టు


బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు మాత్రమే పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టులో సబ్ క్రిటికల్ టెక్నాలజీ వినియోగంతో పెట్టుబడి వ్యయం పెరిగిపోయింది. బొగ్గు గనులకు అత్యంత దూరంగా నిర్మాణంలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు మరొకటి. దీనికి కేవలం బొగ్గు సరఫరాకే సంవత్సరానికి రూ 800 కోట్లు అవుతుంది. అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 




రాష్ట్ర విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి ప్రమాదకరం


కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం... డిస్కంల నష్టాల మొత్తం రూ 62,461 కోట్లు. 31 అక్టోబర్ 2023 నాటికి అప్పుల మొత్తం రూ.81,516 కోట్లు. ఇందులో రూ 30,406 కోట్లు కరెంటు సరఫరా చేసిన జనరేటర్లకు బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రుణం. ఇవి కాకుండా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థలకు రూ 28,673 కోట్ల బకాయిలు చెల్లించాలి. డిస్కంల ఆర్థిక సమస్యలకు కారణం వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ 28,842 కోట్ల బకాయిలు. ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసిన బకాయిలు రూ 14,193 కోట్లు. విద్యుత్ కొనుగోళ్ల వాస్తవ సర్దుబాటు ఖర్చుల కింద రూ 14,928 కోట్ల భారం మోపింది. 




రోజువారీ ఖర్చుల కోసమే అప్పులు


రోజువారీ మనుగడ కోసమే డిస్కంలు అప్పులు చేయవలసి వస్తోంది. విద్యుత్ కొనుగోళ్ళకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం కష్టం. గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో డిస్కంలు అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయి. సమస్యలు అధిగమించి నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్తు, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు అందించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. 




గత ప్రభుత్వం అనేక సమస్యలతో వదిలివేసిన విద్యుత్ సంస్థల స్థితిని ప్రజలకు వివరించవలసిన బాధ్యత తమపై ఉందన్నారు భట్టి. అందుకే, రాష్ట్రం ఏర్పడిన నాటి పరిస్థితులను, అనంతరం విద్యుత్ సంస్థలను నిర్వహించిన తీరు శ్వేత పత్రం ద్వారా వివరించే ప్రయత్నం చేసామన్నారు.